స్వరజ్ఞాని ఇళయరాజా. సరస్వతి పుత్రుడాయన. సినీ సంగీత సామ్రాట్టు. ఇప్పుడున్న సంగీత దర్శకులంతా ఆయన ఫోటోను కంపోజింగ్ రూమ్ పెట్టుకొని పాటలు తయారుచేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ప్రభంజనం. అయితే అంతటి ఇళయరాజాకు కూడా కొన్ని అవాంఛనీయ గుణాలు వున్నాయి. అవాంఛనీయ అంటే అదేదో తప్పు అని కాదు, అయితే అంతటి స్థాయి వ్యక్తి కూడా ఇలా ప్రవర్తిస్తారా ? అని ఆయన్ని విపరీతంగా అభిమానించే అభిమానులు షాక్ అయిపోయే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది యాటిట్యుడ్. ఇళయరాజాది చాలా స్ట్రాంగ్ యాటిట్యుడ్. తనకు నచ్చకపొతే.. కనీసం తన గుమ్మంలోకి కూడా అడుగుపెట్టనివ్వరాయన. ఆయనతో మ్యూజిక్ అంటే.. ఎంతటి దర్శకుడైనా ఆ క్షణానికి టోటల్ గా ఆయన కంట్రోల్ కి వెళ్లిపోవాలి. ఆయనదే పై చేయి కావాలి. అలా కాని పక్షంలో ‘’నీ సినిమాకి నేను మ్యూజిక్ చేయను’’ అని ముఖం మీదే చెప్పేస్తారు. ఇలా ఆయన పేచీ పెట్టుకున్న సందర్భాలు అనేకం వున్నాయి.
మణిరత్నం-ఇళయరాజా కాంబినేషన్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. వీరిద్దరు కలిసి చేసిన మ్యాజిక్ అంతాఇంతా కాదు. ఆ సంగీత సునామీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమానే కాదు వ్యక్తిగతంగా కూడా మణిరత్నం-ఇళయరాజాలది అపూర్వ అనుబంధం. ఇళయరాజా స్వర జ్ఞానానికి ముగ్ధుడు మణిరత్నం. ‘రాజా సర్ ఇజ్ గాడ్’ అని అనేక సార్లు కితాబులిచ్చారు మణిరత్నం. లాంటిది వీరి మధ్య… ఏం జరిగిందో.. ఈ జోడి విడిపోయింది. రోజా సినిమాకి ముందు తన కెరీర్ మొత్తం ఇళయరాజాతోనే ప్రయాణం సాగించిన మణిరత్నం.. రోజా నుండి ఏ. ఆర్ రెహ్మాన్ అనే యువ ప్రభంజనంతో కలసి ప్రయాణం చేశారు. ఇప్పటికీ కూడా మణిరత్నం-ఇళయరాజా ల మధ్య గ్యాప్ అలానే వుండిపోయింది. ఈ గ్యాప్ రావడానికి గల కారణం ఇళయరాజా ‘ఈగో’ అని కోలీవుడ్ జనాలు చెబుతారు. నా మ్యూజిక్ ముందు నీ టేకింగ్ ఎంత?అంటూ ఇళయరాజా ఓ సందర్భంలో మణిరత్నంను తక్కువ చేసి మాట్లాడటం ఈ గ్యాప్ కు దారితీసిందని ఓ టాక్ వుంది. టాక్ కాదు. ఇదే నిజం అని చెబుతారు వీరిని దగ్గరగా పరిశీలించిన వారు.
ఇప్పుడు అదే యాటిట్యుడ్ తో మరో ఆపూర్వ బంధానికి మచ్చ తీసుకొచ్చే విధంగా వుంది ఇళయరాజా ప్రవర్తన. ఆ బంధం పేరు.. ‘’రాజా-ఎస్పీబీ’’. ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం.. ఓ ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్. రాజా స్వరానికి తన అమృత గాత్రంతో ప్రాణం పోసిన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఇళయరాజా పాటల్లో ఎనభైశాతం బాలు పాడిన పాటలే వుంటాయి. ఆ పాటలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ సాయంకాలం పూట అలా రేడియో పెడితే.. అందులో వినిపించే సగానికి పైగా పాటలు వీరిద్దరివే అంటే అర్ధం చేసుకోవచ్చు. రాజా- ఎస్పీబీల మ్యాజిక్. వ్యక్తిగతంగా కూడా వీరిది అపూర్వ అనుబంధం. రాజా కంటే ఎస్పీబీ వయసులో పెద్ద. రాజా ఆయన్ని అన్నా అనిపిలుస్తుంటారు. తనకు సినిమా దారి చూపించింది బాలునే అని అనేక సందర్భాల్లో స్వయంగా చెప్పారు ఇళయరాజా. బాలుకి కూడా రాజా అంటే అమిత ఇష్టం. ‘’నాకు అవకాశం వుంటే.. రాజాను భుజం మీద ఎత్తుకొని జీవితం మొత్తం మోస్తాను’’అని చెబుతుంటారు బాలు.
అలాంటి మైత్రిలో ఇప్పుడు చోటు చేసుకున్న ఓ పరిణామం షాకింగ్ గా వుంది. బాలుకి లీగల్ నోటీసులు పపించారు ఇళయరాజా. ఈ వార్త ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో షాకింగ్ గా వుంది. ‘’ఎస్పీబీ 50’ పేరిట పేరిట వరల్డ్ టూర్ చేస్తున్నారు బాలు. ఇందులో భాగంగా అన్ని దేశాల్లో లైవ్ షోలు ఇస్తున్నారు. ఇపుడు ఇదే లీగల్ నోటీసులకు కారణమైయింది. బాలు తన లైవ్ షోలో తను స్వరపరిచిన పాటలు పాడుతున్నారని, తన లేకుండా ఆయన పాటలు పాడకూడదని.. అలా చేస్తే అది కాపీరైట్ నిబంధనలు అతిక్రమించినట్లు అవుతుందని.. ఇందుకు పరిహారంగా పెద్ద మొత్తంలో డబ్బు కట్టాల్సివుటుందని ఈ లీగల్ నోటీసులో వుంది.
షాకింగ్ గా వుంది ఇళయరాజా లీగల్ నోటీసు. గత కొంతకాలంగా తన అనుమతి లేకుండా తన పాటలు ఎవరూ వాడకూడదని ఒక పోరాటమే చేస్తున్నారు ఇళయరాజా. సినిమాలు, సీరియల్స్ , రేడియో, ఎయిర్ పోర్ట్స్ , హోటల్స్ , రెస్టారెంట్లు.. ఇలా ఎక్కడ కూడా తన అనుమతి లేకుండా తను స్వర పరిచిన పాటలు రాకుడదని, రాయల్టీ చెల్లించిన తర్వాత పాటలు వాడుకోవాలని, నా పాట నేను నాటిన చెట్టని, దాని ఫలాలు యజమానికి అందకుండా ఇతరులు దోచుకోవడం నేరమని చెబుతున్నారు రాజా.
అయితే ఇప్పుడాయన లైవ్ షోలకు కూడా అనుమతి లేదని వాదిస్తున్నారు. రాజా వాదనలో చాల ధర్మ సందేహాలు వస్తున్నాయి. పాటపై స్వరకర్తకు ఎలాంటి అధికారం ఉటుంది అన్నది మొదటి సందేహం. ఒకవేళ అలా వుంటే ఆ పాట పాడిన వారికి కూడా హక్కు వుండాలి కదా. జనరల్ గా సినిమా నిర్మాత డబ్బులు ఇచ్చి మ్యూజిక్ చేయించుకుంటాడు. ఆడియో రైట్స్ ను అమ్మేస్తాడు. అవి వాడుకున్నప్పుడు చట్ట ప్రకారం రాయల్టీ వస్తుంది. అందులో ఎవరికి రావాల్సిన వాట వారికి వెళుతుంది. అయితే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కు స్వర హక్కులు వుంటాయని అంటున్నారు రాజా. మరి ఇలాంటి చట్టం ఎక్కడ వుందో తెలీదు. ఇదంతా కాదు అసలు లైవ్ షోలో కూడా తన పాట పాడకూడదని చెప్పడం ఎంత వరకు సమంజసమో రాజానే తేల్చు కోవాలి. అలా అంటే .. పెళ్లికి పేరంటానికి పెట్టుకునే ఆర్కెస్ట్రాలో కూడా అనుమతి లేకుండా తన పాటలు వుండకూదని చెబుతున్నారా? రాజా.
రాజా వాదన ఏమిటో కానీ ఇప్పుడీ విషయంలో తన ఆప్తమిత్రుడైన బాలుకి లీగల్ నోటీసులు పంపడం ఇళయరాజా మంకుపట్టుదలకు నిదర్శనమనే అభిప్రాయం వెలువడుతుంది. అయితే ఈ విషయంలో బాలసుబ్రహ్మణ్యం చాలా హుందాగా స్పందించారు. ‘’ఇళయరాజా గారి పేరిట నాకు నోటీసులు అందాయి. ఆయన నోటీసులో చెప్పిన ప్రకారం ఇక లైవ్ షోలో ఆయన పాటలు పాడలేం. దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయకండి. ధన్యావాదాలు’’ అంటూ చాలా హుందాగా సమాధానం ఇచ్చారు బాలు. ఇళయరాజా కూడా ఇలా లీగల్ నోటీసులు జోలికి పోకుండా ఇంతే హుందాగా తన పాటలు లైవ్ వద్దని స్వయంగా బాలుకి చెప్పాల్సింది. కానీ రాజా అలా చేయలేదు. అపూర్వ మైత్రిలో కోర్టు సీన్ తీసుకొచ్చారు. ముందే చెప్పుకున్నాం కదా. ఇళయరాజా అంతే.!