చేతిలో ఒక్క హిట్టూ లేకపోయినా.. హీరోల అటెన్షన్ తన మీద ఉండేలా చూసుకొంటున్నాడు పూరి జగన్నాథ్. టెంపర్ తరవాత వచ్చిన జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలు డిజాస్టర్ అయిపోయాయి. ఇప్పుడు రోగ్ సినిమాపైనా ఎవ్వరికీ నమ్మకాల్లేవు. అయినా సరే.. నందమూరి బాలకృష్ణ 101వ సినిమా ఛాన్స్ అందుకోగలిగాడు. ఈ సినిమా హిట్టయితే పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే. అయితే.. ఈ సినిమా రిజల్ట్‌తో పనిలేకుండా పూరితో సినిమా చేయడానికి వెంకీ ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. వెంకటేష్ – పూరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే… బాలయ్య సినిమా ఛాన్స్ రావడంతో వెంకీ సినిమా పక్కన పెట్టేశాడు పూరి. అయితే.. వెంకీ మాత్రం పూరి కోసమే ఎదురుచూస్తున్నాడు.
వెంకీ గురు త్వరలోనే విడుదల అవుతోంది. ఆ తరువాతి సినిమా ఏంటన్నది ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. ఇద్దరు ముగ్గురు దర్శకులు కథలు పట్టుకొని వెళ్లినా.. వెంకీ నుంచి స్పందన రాలేదు. పూరితో ఓ సినిమా చేయాలని వెంకీ గట్టిగా డిసైడ్ అయిపోయాడట. బాలయ్య సినిమా అయ్యేంత వరకూ వెంకీ మరో సినిమా ఏదీ మొదలెట్టడని, పూరి కోసం ఖాళీగా ఉండిపోతున్నాడని తెలుస్తోంది. బాలయ్య సినిమాకి దసరాకల్లా సిద్ధం చేస్తానంటున్నాడు పూరి. ఆ తరవాతే… పూరి ఖాళీ అవుతాడు. పూరి కోసం వెంకీ అప్పటి వరకూ మరో సినిమా చేయకుండా ఖాళీగా ఉంటాడట. వాస్తవానికి ఈ మధ్యలో వెంకీ ఓ సినిమా చేసేయొచ్చు. కానీ…. ఖాళీగా ఉండలేక ఏదో ఓ సినిమా చేసేయడం కంటే, నచ్చిన సినిమా కోసం ఎదురుచూడడం మంచిదని వెంకీ భావిస్తున్నాడని, అందుకే… గురు తరవాత వెంకీ లాంగ్ లీవ్ తీసుకోబోతున్నాడని తెలుస్తోంది.