ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిలింది కచ్చితంగా ఎదురు దెబ్బే..! మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవసం చేసుకుంది. మరీ ముఖ్యంగా జగన్ ఇలాఖా కడపలో తెలుగుదేశం సత్తా చాటుకుంది. ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే విజయమే. అయితే, ఈ ఓటమిపై వైకాపా విశ్లేషణలు మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి, విచ్చలవిడిగా సొమ్ము వెదజల్లి ఎమ్మెల్సీలను గెలిపించుకున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు… ఫిరాయింపు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అనీ, ఎమ్మెల్యేలనే కొనుగోలు చేసిన చరిత్ర ఆయనదనీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లను కొనడం ఆయనకు ఏమంత కష్టమైన పని కాదన్నట్టుగా వైకాపా వర్గాలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఇదంతా నిజమే కావొచ్చు. అయితే, ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనేది ఆ పార్టీ గుర్తెరగాల్సిన సమయం ఇది.
ఎమ్మెల్సీ ఎన్నికలకే తెలుగుదేశం ఈ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న తెగువ చూపించిందంటే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని ఏ రేంజిలో ఫేస్ చేస్తుందనేది ఊహించాలి. ఏ స్థాయిలో సొమ్ము ఖర్చు పెడుతుందనేదీ ఆలోచించాలి. దాన్ని సమర్థంగా ఎందుర్కొనేందుకు వైకాపా కేడర్ సిద్ధంగా ఉందా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలుగుదేశం నాయకులు పక్కా ప్రణాళికతో, పని విభజనతో కష్టించారు. వ్యూహమంతా చంద్రబాబుదే అయినా… కిందిస్థాయి నాయకులు బాధ్యతలు పంచుకుని కృషి చేశారు. తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా ఒక యంత్రాంగం ఉంది. దానికి నిర్దేశించిన లక్ష్యాలను పక్కాగా అమలు చేస్తూ ఉంటుంది. మరి, ఇలాంటి వ్యూహాలతో ఉన్న తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టేందుకు వైకాపా ఏ రేంజిలో సిద్ధపడాల్సి ఉంటుందనేది ఆలోచించాలి. ఏ స్థాయి యంత్రాంగం అవసరముంటుందో తెలుసుకోవాలి.
వైకాపాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత పెరగాలి. ‘క్షేత్ర స్థాయి నుంచీ పైవరకూ అంతా నేనే ఉండాల’న్న జగన్ ధోరణిలో కూడా మార్పు రావాలి. బూత్ లెవెల్ ఓట్ మేనేజ్మెంట్ గురించి వైకాపా సీరియస్‌గా ఆలోచించాలి. జగన్‌గానీ, వైకాపా శ్రేణులుగానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం… 2019 ఎన్నికలు అనేవి వైయస్సార్ లెగసీ మీద జరగబోయేవి కావు! ఈసారి జగన్ నాయకత్వం, ప్రతిపక్ష పార్టీ పనితీరువైపే జగన్ చూస్తారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఒక్కటే జగన్ విజయావకాశం అనుకుంటే సరిపోదనేది విశ్లేషకుల సూచన.
సో… ఈ స్థాయిలో సవాళ్లున్నాయి. వీటిని వాస్తవిక దృక్పథంతో ఆలోచించి చర్చించుకోవాలి. అంతేగానీ… ఏవో మూడో స్థానాలే కదా, అవీ ఎమ్మెల్సీలే కదా, పోతే ఎంతా వస్తే ఎంతా.. అనుకుని సర్దిచెప్పుకుంటే సరిపోదు. వైకాపాలో సంస్థాగతంగా నిష్పాక్షిమైన ఆత్మవిమర్శ జరగాల్సిన సమయం ఇది. మరి, అధినేత జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి.