ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి అంటూ టిడిపి అనుకూల మీడియా అంతా కూడా అదరగొట్టేస్తోంది. టిడిపి నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లందరూ మా వెనకే ఉన్నారు అనే రేంజ్లో రెచ్చిపోతున్నారు. 2019లో కూడా గెలుపు మాదే అని చంద్రబాబు కూడా ఉత్సాహంగా ప్రకటించేశారు. టిడిపివాళ్ళు ఇలాంటి హంగామా చేయడం మామూలే. ఆ మధ్య కాలంలో ఓ సారి టిడిపి ఎమ్మెల్యే చనిపోయిన నేపథ్యంలో ఉపఎన్నికల్లో పోటీ చేసింది టిడిపి. ఆ ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీలేవీ పోటీ చేయలేదు. స్వతంత్ర అభ్యర్థులు ఎవరో ఇద్దరు పోటీ చేశారు. వాళ్ళు కూడా చంద్రబాబు మనుషులే అని రాజకీయ విశ్లేషకులు ఎన్నికలకు ముందే చెప్పారు. షరా మామూలుగానే ఆ స్వతంత్ర అభ్యర్థులు ఓడిపోయారు. టిడిపి అభ్యర్థి గెలిచాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలిచిందని చెప్పి పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల ఎంపీలకూ టముకు వేసి మరీ చెప్పారు టిడిపి ఎంపీలు. ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎంపిలు అసలు నిజాన్ని ఆయా పార్టీల ఎంపీలందరికీ చెప్పారు. టిడిపి గెలుపు ప్రచారం జిమ్మిక్ దెబ్బకు జాతీయ స్థాయి నాయకులు కూడా షాక్ అయ్యారు. అప్పట్లో ఇదో పెద్ద కామెడీ వార్త అయిపోయింది. ఇప్పుడు టిడిపి చేసుకుంటున్న ప్రచారం కూడా అలాగే ఉంది. వైసిపికి పూర్తి ఆధిపత్యం ఉన్న చోట బరిలోకి దిగింది టిడిపి. ఆ మధ్య తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు ఇస్తూ అడ్డంగా బుక్కయిన చంద్రబాబు తనను తాను సమర్థించుకోవడానికి నానా పాట్లూ పడ్డారు. సంఖ్యాబలం లేకుండా అభ్యర్థిని నిలబెట్టిన కెసీఆర్‌పై తిట్ల వర్షం కురిపించాడు. మరి ఇప్పుడు చంద్రబాబు సంఖ్యాబలం లేకుండా ఎలా అభ్యర్థులను నిలబెట్టాడో టిడిపి వాళ్ళు చెప్పాలి.
ఇక ఈ ఎన్నికల సందర్భంగా టిడిపి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ఇష్టారీతిన వాడుకున్నారు. మంత్రులందరూ కూడా పాలనా బాధ్యతలను వదిలేసి ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. గెలుపు కోసం టిడిపి నాయకులను చంద్రబాబు మామూలుగా హింసించలేదు. భూమా నాగిరెడ్డి మరణానికి కారణం కూడా అదే అని రాజకీయవిశ్లేషకులు తేల్చిపడేశారు. భూమా చనిపోయిన వెంటనే అసెంబ్లీకి అఖిలప్రియను తీసుకొచ్చిన చంద్రబాబు…ఆ వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి కూడా అఖిల ప్రియను పురమాయించారు. ఇక నోట్ల రద్దు పుణ్యమాని ఈ ఎన్నికల్లో ఓ కొత్త ట్రెండ్ ఫాలో అయింది టిడిపి. నోట్ల స్థానంలో చెక్కులు పంచింది. అధికార వ్యవస్థలన్నింటినీ అక్రమ మార్గాన నడిపించి, విచ్చలవిడిగా డబ్బును వెదజల్లి, బ్లాక్ మెయిల్ రాజకీయాలు, భయాందోళన కలిగించే రాజకీయాలకు పాల్పడిన చంద్రబాబు ఫైనల్‌గా వైసిపి నాయకులను తనవైపు లాక్కుని గెలిచేశాను అనిపించుకున్నాడు. అయితే ఆ గెలుపు మాత్రం కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గేలిచేసేలా ఉంది. ఇకపై ప్రజాస్వామ్య విలువలు, అవినీతి, డబ్బు పంపకాల గురించి చంద్రబాబు మాట్లాడితే జనాలు ఎటకారంగా నవ్వుకునే పరిస్థితిని ఈ గెలుపుతో కొని తెచ్చుకున్నాడు చంద్రబాబు.
ప్రజా ప్రయోజనాలకు, ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ చంద్రబాబు సాధించిన ఈ గెలుపులో టిడిపి వాళ్ళకు మాత్రం ఓ సానుకూలాంశం ఉంది. గెలుపు అక్రమమా? కాదా? ఎలా గెలిచారు? ఎన్ని తప్పులు చేశారు? లాంటి విషయాలను పక్కనపెడితే పోల్ మేనేజ్మెంట్….ఓట్ల కొనుగోలు విషయాల్లో మాత్రం చంద్రబాబును కొట్టే స్థాయి జగన్‌కి అస్సలు లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.