తెలంగాణతో తెలుగుదేశం పార్టీది జీవన్మరణ సమస్య..! ఎందుకంటే, నాయకులు లేరు. పేరున్నవారు పార్టీలో లేరు. ఉన్నవారి పేరు పార్టీకి ఎంతగా ఉపకరిస్తుందో తెలీదు..! సో.. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉనికి నిలుపుకోవడమే పెద్ద సవాలుగా మారుతుందని అనిపిస్తోంది. అందుకే, ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇస్తోంది. అయితే, ఈ సంకేతాలు కేవలం రేవంత్ రెడ్డి నుంచి మాత్రమే వస్తుండటం విశేషం. ఆయన వరుస చూస్తుంటే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సంబంధం లేకుండా.. వచ్చే ఎన్నికల్లో పొత్తులను ఖరారు చేసే విధంగా ఉన్నారని అనిపిస్తోంది.
రేవంత్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనీ, ఇదే విషయమై దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి మరీ మాట్లాడారంటూ ఓ పుకారు షికారు చేసింది. దీనిపై రేవంత్ స్పందించారు. అలాంటి ఫోన్లేవీ తనకు రాలేదనీ, అలాంటి ఆలోచనలు లేవంటూ ఖండించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, టి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను భేటీ అయ్యానని మాత్రం చెప్పడం విశేషం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలన్నదే తమ లక్ష్యమనీ, ఈ ప్రయత్నంలో ఇతర రాజకీయ పార్టీలు ఒక కూటమిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్షాలు ఒక వేదిక మీదికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయమై ఉత్తమ్‌తో తాను చర్చించానని రేవంత్ చెప్పారు.
ఇంత కీలకమైన అంశంపై అధినేత చంద్రబాబు పర్మిషన్ తోనే ఉత్తమ్‌తో రేవంత్ భేటీ అయ్యారా..? లేదంటే, తన సొంత నిర్ణయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అర్రులు చాచుతున్నారా అనేది సందేహం! రాష్ట్ర విభజన కారణం సోనియా గాంధీ అనీ.. ఆంధ్రాను అనాధగా చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదే అని ఇప్పటికీ చంద్రబాబు విమర్శిస్తూనే ఉంటారు. ఏపీలో కాంగ్రెస్ పై తెలుగుదేశం వైఖరి ఇలా ఉంటే.. తెలంగాణలో అదే పార్టీతో పొత్తును చంద్రబాబు ఎలా అంగీకరిస్తారు..? తెరాసను ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ తో కూడా పొత్తుకు టీడీపీ సిద్ధమైతే… కేంద్రంలో భాజపాతో కొనసాగుతున్న పొత్తు సంగతేంటీ..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలూ అనుబంధ ప్రశ్నలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి… ఇదంతా రేవంత్ సొంతంగా చేస్తున్నారా..? అలాంటి పరిస్థితే ఉంటే.. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రస్థానం దారి మార్చుకుంటుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.