హిట్టుకీ ఫ్లాపుకీ మధ్య దూరం చాలా ఎక్కువ. భౌతికంగా.. మానసికంగానూ! ఓ హిట్టొచ్చినప్పుడు చూడండి. హీరో, దర్శకుడు, హీరోయిన్… ఇలా ఎవ్వరైనా సరే భుజాలు ఎగరేస్తారు. వాళ్లు కాస్త సైటెంట్‌గా ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు.. `మీ అంత గొప్పోడు లేడు సామీ` అన్నట్టు ప్రవర్తిస్తారు. దాంతో… వినయంగా ఉందామనుకొన్నా సరే కొమ్ములు మొలిచేస్తాయి. ఒకట్రెండు ఎదురు దెబ్బలు తింటే.. మళ్లీ ఆ కొమ్ములు మాయం అయిపోతాయి. `జయాపజయాల్ని ఒకేలా స్వీకరిస్తా` అనే మాట.. కేవలం మాట వరసకే. ఎందుకంటే హిట్టంటేనే అందలం ఎక్కడం. ఫ్లాప్ అంటే అగాథంలో కూరుకుపోవడం. శ్రీనువైట్ల ఈ రెండూ చూశాడు. ఒకప్పుడు… బడా దర్శకుడి స్థాయి ఆయనది. హీరోలంతా శ్రీనువైట్ల తో సినిమా చేయాలని తెగ ఉత్సాహపడిపోయారు. దూకుడు టైమ్‌లో అయితే శ్రీనువైట్ల చెప్పిందే వేదం.
ఆగడుతో.. శ్రీను జాతకం పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా ఫ్లాప్ రేంజ్, దాని చుట్టూ ముసురుకున్న వివాదాలు, శ్రీనువైట్ల దూకుడు ఇవన్నీ… కలగలిపి ఆ ఫ్లాప్‌ని భూతద్దంలో చూపించాయి. బ్రూస్లీ కూడా ఫట్టే. దాంతో.. శ్రీనువైట్ల దిగిరాక తప్పలేదు. తన చేతిలో ఉన్న సినిమా మిస్టర్. దీనిపైనే శ్రీనువైట్ల ఆశలన్నీ పెంచుకొన్నాడు. ఈ సినిమాని ఎలాగైనా సరే.. హిట్ చేయాల్సిందే అనే తపన తనలో కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే మారాడు. ఈ సినిమా స్టిల్స్, బయటకు వచ్చిన పాటలు….చూస్తుంటే ఓ కొత్త శ్రీనువైట్ల తప్పకుండా కనిపిస్తాడు. తన ఫార్ములాని దాటి బయటకు వచ్చిన నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా కోసం శ్రీనువైట్ల పారితోషికం తీసుకోలేదన్నది లేటెస్ట్ టాక్. అదీ మార్పులో భాగమే. సినిమా హిట్టయితే, లాభాలొస్తే అప్పుడు వాటా ఇవ్వండి అన్నాడట. ఓ దర్శకుడు ఇలాంటి ఆఫర్ ఇస్తే అంతకంటే కావల్సింది ఏముంది? ఇప్పుడు మీడియాతోనూ శ్రీనువైట్ల బాగా టచ్‌లోకి వచ్చేశాడని తెలుస్తోంది. ఇది వరకు శ్రీనుకి మీడియాతో పెద్దగా రాపో లేదు. ఇంటర్వ్యూలకూ, కాంట్రాక్ట్‌లకు దూరంగా ఉండేవాడు. అయితే.. ఇప్పుడు తనకు తాను ఫోన్లు చేసి…
`ప్రమోషన్లు ఎలా చేస్తే బెటర్` అంటూ… పాత్రికేయుల దగ్గర సలహాలు కూడా తీసుకొంటున్నాడట. ఒక్కటి మాత్రం స్పష్టం. మిస్టర్ సినిమాని శ్రీను లైఫ్ అండ్ డెత్ మేటర్‌గా తీసుకొన్నాడు. అందుకే అంత కష్టపడుతున్నాడు. ఈ సినిమా ఫలితం శ్రీనువైట్ల భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. సో.. శ్రీను హిట్టు కొట్టాలని, దర్శకుడిగా తన స్టామినా చూపించాలని కోరుకొందాం! అప్పుడే ఈ మార్పుకి సరైన ఫలితం ప్రతిఫలం దక్కినట్టు అవుతుంది.