ఒక చిన్న గెలుపును కూడా ప్రపంచాన్ని గెలిచినంత సంబరంగా ప్రచారం చేసుకోవడంలో టిడిపి తర్వాతే ఎవరైనా. కెరీర్ ప్రారంభం నుంచీ కూడా కేవలం పబ్లిసిటీని మాత్రమే నమ్ముకుని రాజకీయ మనుగడ సాగిస్తున్న చంద్రబాబు…ఆ విషయంలో మాత్రం ఇండియాలోనే…ఆ మాటకొస్తే ప్రపంచంలోనే నంబర్ 1 నాయకుడు అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఓట్లేసిన ఎమ్మెల్సీ స్థానాలను టిడిపి ఎక్కువగా గెలుచుకుంది. ఆ గెలుపును చూపించి టిడిపి వాళ్ళు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా చంద్రబాబు పనితీరుకు, టిడిపి ప్రభుత్వానికి రెఫరెండం అనేశారు. ప్రతిపక్షం పని అయిపోయిందని చెప్పేశారు. చంద్రబాబు అత్యుత్సాహం కూడా అవధులు దాటేసింది. 2019లోనూ, ఆ తర్వాత ఎన్నికల్లోనూ టిడిపిదే అధికారం. నేనే సిఎం అని చెప్పేసుకున్నారు. పులివెందుల కూడా గెలిచేస్తాం అని ప్రగల్భాలు పలికారు. కానీ ఆనందం అంతా కూడా 24గంటల తేడాలో ఆవిరైపోయింది. ప్రజా ప్రతినిధులను అయితే డబ్బులు, పదవులు, బెదిరింపుల రాజకీయంతో బాగానే కొనగలిగారు. విజయం సాధించారు. ప్రజలను కొనడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకుగాను నాలుగు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలు ఎన్నికల్లో భాగమయ్యాయి. చంద్రబాబు మేథస్సును అర్థం చేసుకునే స్థాయి లేని గ్రామీణుల్లో, నిరక్షరాస్యుల్లో బాబు పాలన పట్ల వ్యతిరేకత ఉంటుంది, కానీ చదువుకున్నవాళ్ళు మాత్రం చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ అంటే పడిచచ్చిపోతూ ఉంటారు అని టిడిపి అనుకూల మీడియా అస్తమానూ టముకు వేసే గ్రాడ్యుయేట్స్, టీచర్లే ఓటర్లు. అలాంటి ఎన్నికల్లో ఐదు స్థానాలకు పోటీ చేస్తే ఒక్కచోట గెలవగలిగింది టిడిపి. ఆ గెలిచిన అభ్యర్థి కూడా టిడిపి బలపరిచిన బిజెపి అభ్యర్థి. ఐదు స్థానాలకు ఒక్క స్థానంలో గెలవడం అంటే చంద్రబాబు పాలన పట్ల ప్రజలకు ఎంత ప్రేమ ఉన్నట్టు? ప్రజాప్రతినిధులు ఓట్లేసిన ఎన్నికలే చంద్రబాబు పాలనకు రెఫరెండం అని చెప్పి టిడిపి నాయకులు ఓ రేంజ్లో హల్చల్ చేశారు. మరి ఇప్పుడు చదువుకున్న ప్రజలు ఓట్లేసిన….అది కూడా వందల సంఖ్యలో మాత్రమే ఉన్న ప్రజా ప్రతినిధుల సంఖ్యతో పోల్చుకుంటే…వేల సంఖ్యలో ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయాన్ని ఏ విధంగా చూడాలి. ఈ ఎన్నికలను చంద్రబాబుకు వార్నింగ్ బెల్స్‌గా పరిగణించకూడదా?
చంద్రబాబు ఎన్నిరకాలుగా సమర్థించుకుందామనుకున్నా ఆయన వైఫల్యాలు మాత్రం ఈ సారి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం చాలా చాలా తక్కువ ఉంటుందని తెలిసీ…ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేపోయాడు. ఇక మోడీతో నాది అభివృద్ధి జోడీ అని ఎన్నికల ప్రచారంలో కథలు చెప్పారు. కానీ కేంద్రప్రభుత్వం నుంచి చంద్రబాబు సాధించింది ఏమీలేదు. ప్యాకేజీ మాయలు, పోలవరం గిమ్మిక్కులు ప్రజలకు తెలియవనుకోవడం బాబు భ్రమ. ఎన్టీఆర్‌ని దించినప్పుడు అంటే కేవలం టిడిపి అనుకూల మీడియానే ఉంది కాబట్టి బాబు బ్రతికిపోయాడు. కానీ ఇప్పుడు …సోషల్ మీడయా యుగంలో మేనేజ్ చేయడం….ప్రజలకు సమాచారం చేరకుండా అడ్డుకోవడం అసాధ్యం. ప్రత్యేక హోదా ప్రయోజనాలు ఏంటో చెప్పండి అని బాబు దబాయించొచ్చుకాక…కానీ ఆ దబాయింపు వెనకాల బాబు స్వార్థం ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. రైల్వే జోన్, రాజధాని నిర్మాణం…ఇలా ఏ విషయంలోనూ బాబు పాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తిగా లేరు అన్నది నిజం. ఇక రుణమాఫీలు అని చెప్పి బాబు చేసిన మోసం విషయంలో అయితే ప్రజల కోపం కూడా మామూలుగా లేదు. ఎన్నికలకు ఇంకో రెండేళ్ళు మాత్రమే టైం ఉంది. ఇప్పుడైనా విమర్శిస్తున్న అందరిపైనా ఎదురుదాడి చేయడం, వాళ్ళ నోళ్ళు మూయించాలన్న ప్రయత్నాలు చేయడం మానేసి…మూడేళ్ళగా మాటల్లో చెప్తున్న అభివృద్ధిని చేతల్లో చూపించకపోతే మాత్రం 2019 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించడం ఆయన భజన మీడియాకు కూడా సాధ్యం కాకపోవచ్చు. మరి ఈ ఫలితాలు చూశాక అయినా బాబులో మార్పు వస్తుందేమో చూడాలి.