ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో అగ్రిగోల్డ్ సమస్యపై ఒక్కసారిగా అధికార తెలుగుదేశం ఆత్మరక్షణలో అభద్రతలో పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్నే వ్యూహాత్మక ఎదురుదాడిగా మార్చుకోవడానికి వారు తంటాలు పడుతున్నట్టు తెలుస్తూనే వుంది. అగ్రిగోల్డుకు అపారమైన ఆస్తులు వున్నా ఈ పరిధిలోకి తీసుకురాలేదు. పైగా వారికి సంబంధించిన వారి దగ్గర ముందో వెనకో కొననైతే కొన్నారు. ఆ మాట మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా కాదనడం లేదు. కొనడం నిజమైనప్పుడు సాంకేతికంగా ముందా వెనకా మీమాంస పెద్ద సమస్యేముంటుంది? నిజానికి ముఖ్యమంత్రికి కోపం రావల్సింది దీనిపైన విచారణ జరిపి నిజానిజాలు తెలిస్తే వెలివేస్తానని ప్రకటించవలసింది తన మంత్రిని. అలాగాకుండా నిజం కాకుంటే ప్రతిపక్ష నేతను వెలివేస్తానని షరతు పెట్టడం దానికి ఒప్పుకోవాలంటూ రెండు రోజులు సభను వృథా చేయడం ఇది వరకెన్నడూ చూడని విపరీతం. నిజానికి రెండవ రోజు సభలో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడినప్పుడు కొంత మెతకదనం కనిపించింది.నిజం కాకపోతే సారీ చెబుతాననో మరొకటో చెప్పాలని ఆయన సూచించారు. ఇతర మంత్రులు అచ్చెం నాయుడు పీతల సుజాత వంటివారు మాత్రం శాతకర్ణి సినిమాలోని డైలాగు తీసుకుని సమయం లేదు రణమా శరణమా అని డైలాగులు చెప్పారు.ఒకసారి విచారణకు వచ్చిన తర్వాత ఇంకా రణం చేస్తున్నదేముంది? కాకుంటు ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టడానికి ఆయన కూడా వైదొలగాలని వాదిస్తున్నారు. ముందు తాను చెప్పేది సభ వినాలని జగన్ కోరుతున్నారు.
అందుకు కూడా అవకాశం ఇవ్వకుండా సవాలు తీసుకుంటున్నావా లేదా అని వెంటపడటం, దానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా అదే రాజకీయ అంశం నిబంధనలకు సంబంధించిన విషయం అన్నట్టు రెట్టించడం విచిత్రమే.ఇక్కడ నిజాయితీ నిరూపించుకోవలసింది ప్రభుత్వమే గాని ప్రతిపక్షం కాదు. ఒకవేళ నివేదిక పత్తిపాటికి అనుకూలంగా వస్తే అప్పుడు రాజీనామా కోసం రభస చేయవచ్చు గాని ఇప్పుడే చర్చను దానిపై కేంద్రీకరించడమేమిటి? పైకి ఏం మాట్లాడినా ఇది అధికార పక్షం అభద్రతనే వెల్లడిస్తుంది. బహుశా అందుకే జగన్ కూడా తన వాదన తాను చేస్తున్నారే గాని ఈ సవాళ్ల చర్చలోకి దిగడం లేదు.చివరకు ఈ విషయంలో ప్రభుత్వమే సర్దుకోవడం అనివార్యమవుతుంది. ఈ సమస్య మధ్యలోనే స్పీకర్ కోడెలపై సాక్షి వార్తను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించేది కాదని ప్రభుత్వం గమనించినట్టు అర్థమవుతుంది. కాదని ఒక వేళ మరీ కక్షతో వ్యవహరిస్తే అది బెడిసికొట్టడం అనివార్యం. మరి అనుభవానికి మారుపేరుగా చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మేరకు సహేతుకమైన ముగింపు ఇస్తారో చూడాలి. కేసులు వున్న జగన్‌పైన వైఎస్ఆర్సిపిపైన ప్రభుత్వం దాడి చేసి వుండొచ్చు గాని ఈ పరాజయం జగన్ వరకూ బాగానే వ్రారిని ఇరుకున పెట్టారు. అయితే మొత్తంగా ఎలా చేయాలనే వ్యూహం మాత్రం సరిగ్గా లేదు.