అగ్రిగోల్డ్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిజానికి, ఈ బాధితులు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. ఈ స్థాయిలో చర్చ జరిగిన దాఖలాలు గతంలో తక్కువే. అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష నేత జగన్ శాసనసభలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం స్పందించి ఓ చిత్రమైన సవాలు చేసిన సంగతి కూడా విదితమే. ఆరోపణలు అసత్యమైతే జగన్ నీ, సత్యమైతే పుల్లారావునీ సభ నుంచీ వెలేద్దామంటూ అధికార పార్టీ తీర్మానించేసింది!
ఇదే అంశమై జగన్ మాట్లాడుతూ… మంత్రి పుల్లారావుపై తమకు ఎలాంటి శతృత్వం లేదనీ, రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం లేదనీ, బాధితులు ఇచ్చిన ఆధారాలతోనే ఆరోపణలు చేశానని జగన్ అన్నారు. తాము దాచుకున్న సొమ్ము పోతుందేమో అనే బాధతో చాలామంది ఆవేదన చెందుతున్నారన్నారు. అయితే, అగ్రిగోల్డ్ బాధితుల గురించి మాట్లాడుతుంటే… స్పీకర్ వ్యాఖ్యలను ప్రస్థావించి సభను డైవర్ట్ చేయడం చిత్రంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో పుల్లారావు ఒక చిన్న చీమ మాత్రమే అన్నారు. తాము గతంలో చేసిన సవాళ్లేవీ చంద్రబాబు స్వీకరించలేదని ఈ సందర్భంగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి టెలీఫోన్ వాయిస్ చంద్రబాబుది అవునా కాదా తేల్చి చెప్పగలరా అంటూ సవాలు చేశామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి, ఉప ఎన్నికలకు పంపించి గెలిపించుకోగలరా అంటూ సవాలు చేశామనీ చెప్పారు. వీటిపై స్పందించకుండా టాపిక్ డైవర్ల్ చేశారంటూ జగన్ మండిపడ్డారు.
మొత్తానికి, ఈ సవాళ్ల విషయంలో తెలుగుదేశం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే, అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం కోడెల వ్యాఖ్యల వక్రీకరణ ఇష్యూని తెరమీది తెచ్చారు. దీనికి ధీటుగా జగన్ కూడా ఓటుకు నోటు వ్యవహారం, ఫిరాయింపుదారుల అనర్హతను తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ వ్యాఖ్యల వక్రీకరణ పేరుతో జగన్ తోపాటు సాక్షి మీడియాని కూడా ముగ్గులోకి లాగాలని ప్రయత్నిస్తే… ఇప్పుడు ఓటుకు నోటు, ఫిరాయింపుదారుల అనర్హతలు ముందుకొస్తున్నాయి. పోనీ.. ఈ రెండు విషయాల్లోనూ తమ తీరును సమర్థించుకునే సత్తా తెలుగుదేశం పార్టీకి లేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఫిరాయింపుదారులపై ఇంకా ఎందుకు అనర్హత వేటు వెయ్యడం లేదనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. ఓటుకు నోటు కేసులో బయటపడ్డ ఆడియో టేపులో ఉన్న వాయిస్ చంద్రబాబుది అవునా కాదా అనే అంశంపై మాట్లాడేంత ధైర్యం తెలుగుదేశంలో ఏ నాయకుడికీ లేదన్నది ఓపెన్ సీక్రెట్. సో… ఈ అంశాలను మరోసారి వెలుగులోకి తెచ్చేందుకు జగన్ ప్రయత్నించడం.. తెలుగుదేశం చేసుకున్న సెల్ఫ్ గోల్ కి సైడ్ ఎఫెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.