సల్మాన్ ఖాన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చిన సల్లూభాయ్… ఇప్పుడు ట్యూబ్ లైట్ తో అలరించడానికి రెడీ అయ్యాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్‌లో విడుదల కాబోతోంది. సల్మాన్‌తో కబీర్‌కి ఇది మూడో చిత్రం. భయరంగీ భాయ్‌జాన్ తరవాత కబీర్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే ట్యూబ్‌లైట్ మార్కెట్ వర్గాల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. శాటిలైట్ పరంగానూ ట్యూబ్ లైట్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని ఏకంగా రూ.130 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్. ఇదే నిజమైతే… ట్యూబ్‌లైట్ ఆల్ టైమ్ ఇండియన్ రికార్డ్ సృష్టించినట్టే లెక్క. ఇది వరకు షారుఖ్‌ఖాన్ సినిమా దిల్వాలే రూ.125 కోట్లు దక్కించుకొంది. ఆ రికార్డ్‌ని సల్మాన్ బద్దలు కొట్టేశాడన్నమాట.
అన్నట్టు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. చాలా కాలం తరవాత సల్మాన్ – షారుఖ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం దక్కబోతోంది. అందుకనే.. ఈసినిమాపై మరింత ఫోకస్ పెరిగింది. ఇండియా – చైనా మధ్య సాగే యుద్ధ నేపథ్యంలో నడిచే ప్రేమ కథ ఇది. ఓ భారతీయ సైనికుడికీ, చైనా అమ్మాయికీ మధ్య ఏర్పడిన ప్రేమ.. చివరి ఎన్ని మలుపులు తీసుకొంది?? అనే నేపథ్యంలో ట్యూబ్‌లైట్ సాగబోతోంది. ఎమోషన్ సీన్స్‌ని అద్భుతంగా పండించే కబీర్ ఖాన్.. ఈ సినిమాలోనూ దాన్నే ఆయుధంగా మలచుకొన్నాడట. మరి రిజల్ట్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.