తెలంగాణ శాసనసభలో బిజెపి టిఆర్‌ఎస్‌ల మధ్య నడుస్తున్న ప్రహసనం చూస్తుంటే ఏదో జరుగుతోంది అని స్పష్టమై పోతుంది. . రెండు రోజుల వ్యవధిలో టి అసెంబ్లీలో ఈ రెండు పార్టీల మధ్య పరస్పర క్షమాపణలు స్నేహాలాపనలు సస్పెన్షన్లు, బిల్లుల వాయిదాలు అన్ని కలిపి ఒక సీరిస్‌గా చూస్తే మ్యాచ్ పిక్సింగ్ తెలిసిపోతుంది. పరిపూర్ణానంద స్వామితో భేటీలోనే బిజెపి కోణం వుందని తెలుగు360 ఈ వరకే స్టోరీ ఇచ్చింది. తదుపరి పరిణామాలు దాన్ని ఇంకా ఇంకా ధృవీకరించేలా వున్నాయి.సంఖ్య రీత్యా ఎక్కువ మంది వున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నా బిజెపినే ఎక్కువ నిలదీయడం, దానికి టిఆర్‌ఎస్ కూడా విపరీతంగా స్పందించడం అందరూ గమనిస్తున్నారు. విద్యుత్ శాఖపద్దుపై చర్చ సందర్భంగా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి కేంద్ర విద్యుత్ సంస్థలు మార్వాడీల కన్నా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.దీనిపై బిజెపి ఎంఎల్‌ఎలు పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెల్పగా ఆయన వ్యాఖ్య ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పారు. ఇక బిజెపి శాసనసభా నేత కిషన్‌రెడ్డి తాము పోడియం దగ్గరకు వెళ్లడం తప్పేనని క్షమాపణ చెప్పారు.
ఇలా చేసిన వారిని వెంటనే బయిటకు పంపాలంటూ రూపొందించిన రూల్ ఇతర పార్టీలకు వర్తింపచేసినట్టు బిజెపికి చేసి వారిని బయిటకు పంపించలేదు. తర్వాత ముస్లిం రిజర్వేషన్ల బిల్లుపై సభ వెలుపల ఆందోళన చేపట్టిన బిజెపి నేతలు సభలోనూ రభస చేశారు. వారిని రెండు రోజులు మాత్రం సస్పెండ్ చేస్తూ సభాపతి ప్రకటించారు. మరో వైపున ముఖ్యమంత్రి కెసిఆర్ మరో వారంలో బిసికమీషన్ నివేదిక వచ్చాక ఈ బిల్లు ప్రవేశపెడతామని వెనక్కు తగ్గారు.ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌తోనేరుగా కలవడానికి వీలుకాకున్నా సహాయం తీసుకోవాలని బిజెపి భావిస్తున్నదట. మజ్లిస్‌తోస్నేహాన్ని కొనసాగిస్తూనే బిజెపిని కూడా సంతోషపెడితే తమకు ఢోకా వుండదని కెసిఆర్ అనుకుంటున్నారట. కవితను కేంద్ర మంత్రివర్గంలో చేర్చాలనేది కూడా ఆ కుటుంబ ఎజెండాగా వుంది. ప్రధాని మోడీ కూడా తెలుగు వారు ఎవరు కలిసినా కవిత ఎలా వుంది అని అడుగుతుంటారని ఒక మాజీ ఎంపి చెప్పారు. ఇదంతా చూస్తుంటే సవ్యసాచిలాగా కెసిఆర్ ఒక చేత్తో మజ్లిస్‌ను మరో చేత్తో బిజెపిని మ్యానేజ్ చేస్తున్నట్టు తెలియడం లేదూ?బహుశా అది మ్యాచ్ ఫిక్సింగ్ కావచ్చని రాజకీయ వర్గాలు సందేహిస్తున్నాయి