చిరంజీవి 150వ సినిమా కోసం పూరీ జగన్నాథ్ చేయని ప్రయత్నం లేదు. ఆటోజానీ అనే కథ చెప్పడం, టైటిల్ రిజిస్టర్ చేసేయడం, షూటింగ్ కూడా మొదలైపోతుంది అనుకొంటున్న దశలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సెకండాఫ్ సరిగా లేదన్న ఒకే ఒక్క కారణంతో చిరు ఆ కథని పక్కన పెట్టేశాడు. చిరు 151వ సినిమా సమయంలోనూ పూరి పేరు ప్రస్తావనకు వచ్చింది. కానీ అప్పుడూ వర్కవుట్ కాలేదు. అయినా పూరిలో ఆశలేం చావలేదు. ‘బాస్ తో సినిమా గ్యారెంటీ’ అనే ధీమా వ్యక్తం అవుతోంది. ఇటీవల పూరి చిరుని కలిశాడట. ఓ కథ కూడా వినిపించాడట. ఈ విషయాన్ని పూరినే చెబుతున్నాడు. ”అందరితో సినిమాలు చేశా. చిరంజీవిగారితో తప్ప. ఆయనతోనూ తప్పకుండా సినిమా చేస్తా. ఆయన సినిమాల్ని లైన్లో నిలబడి, టికెట్టు కొని మరీ చూశా. ఆయన్ని తెరపై ఎలా చూపించాలో నాకు బాగా తెలుసు” అంటున్నాడు పూరి.
చిరుతో సినిమా చేయాలనుకొని పూరి భంగపడడంతో ఆటోజానీ కథని అటూ ఇటూ మార్చి.. దాన్ని రవితేజతో తీస్తారని అప్పట్లో చెప్పుకొన్నారు. కానీ… పూరి మాటల్ని బట్టి చూస్తే చిరుపై, ఆటోజానీ స్క్రిప్టుపై ఆశలు వదులుకున్నట్టు కనిపించడం లేదు. చిరు మరో ఐదేళ్ల పాటు సినిమాల్ని చేసే స్పీడులోనే ఉన్నాడు. కొత్త దర్శకులతో పనిచేయడం చిరుకి బొత్తిగా ఇష్టం లేదు. స్టార్లంతా బిజీ బిజీగా ఉన్నారు. ఈ దశలో పూరిలాంటి వాళ్లకు ఛాన్సులివ్వడం మినహా చిరు దగ్గర మరో మార్గం లేకపోవచ్చు. అందుకే పూరి కూడా చిరుపై ఆశలు వదలుకోలేకపోతున్నాడు. మరి చిరు ఆలోచనలెలా ఉన్నాయో..??