ప్రధాని నరేంద్ర మోడీకి సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు అంటే అయిష్టత వుందని బిజెపి నేతలే చెబుతుంటారు. దానికి తగినట్టే వెంకయ్య నాయుడు , ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి ఎన్ని విన్యాసాలు చేసినా ప్రత్యేక హౌదా వంటి విషయాల్లో ఇసుమంతైనా కనికరించింది లేదు. మోడీని దేవుడని చెప్పిన వెంకయ్య వీరభజనకు కూడా చలించలేదు. వీటన్నిటినీ మించిన వింత ఆదివారం దేశ రాజధానిలో జరిగింది. ఉగాదికి ముందస్తుగా వెంకయ్య నాయుడు స్వగృహంలో వేడుక ఏర్పాటు చేశారు. ప్రముఖులందరినీ రావించి సాక్షాత్తూ ప్రధానినే ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. మోడీ షరా మామూలుగా వేదిక ఎక్కి తన శైలిలో ప్రసంగం చేశారు. భారత దేశ వైవిధ్యం, భాషా పరమైన వ్యత్యాసాల వంటివి ప్రస్తావించారు. దేశం వివిధ ప్రాంతాల్లో సంవత్సరాది వేడుకలు మొదలవుతున్నాయంటూ శుభాకాంక్షలు చెప్పారు. అంతకు ముందు ప్రదర్శించిన నృత్యరూపకంలో జటాయువు పాత్రను ప్రస్తావించి టెర్రరిజంపై పోరాడిని మొదటి యోధ ఆ పక్షి రాజమేనని కొనియాడారు. ఇదంతా బాగానే వుంది గాని మోడీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇంటికి పిలిచిన వెంకయ్య నాయుడు పేరు తలవకపోవడం ఆహూతులను ఆశ్చర్యపరచింది. మరో విషయమేమంటే తెలుగు సంవత్సరాది అయినా కేవలం తెలంగాణను తప్ప ఆంధ్ర ప్రదేశ్ పేరు పలకలేదు.. హర్యానాతో తెలంగాణ చేసుకున్న ఒప్పందం గురించి మాత్రమే ప్రస్తావించారు. ఎపి అంటే హౌదా ముచ్చట వస్తుందని సంకోచించారేమో తెలియదు. ఆ సంగతి ఎలా వున్నా హౌత(హౌస్ట్) వెంకయ్యపేరు ఎందుకు చెప్పలేదనేది సమాధానం లేని ప్రశ్న. తన మవవరాలు వేసిన ప్రధాని చిత్తరువును ఆయనకు సమర్పించారు. కుంటుబ సభ్యులంతా పాల్గొన్నారు.తెలుగు ఛానళ్లు పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి గాని ఈ విస్మరణను మాత్రం తామూ విస్మరించాయి.