ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ శాసనసభల తీరుతెన్నులు గమనించేవారికి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ చాలా క్రియాశీలపాత్ర నిర్వహించడం అర్థమవుతూ వుంది. కెసిఆర్ మాటకారి గనక ఎప్పుడూ చురుగ్గానే జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సారి ఆయన ప్రసంగాలూ బాగా పెరిగాయి. కీలకమైన విధాన నిర్ణయాలన్నీ ఆయనే ప్రకటించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పాయింట్లన్నిటికీ స్వయంగా జవాబు చెబుతున్నారు. అరుదుగా తప్ప ఘర్షణ వైఖరికి పోకుండా అన్నీ చేస్తామన్నట్టే మాట్లాడుతున్నారు. అయితే సభ వెలుపల మాత్రం అరెస్టులు ఆంక్షలు జోరుగానే నడుస్తున్నాయనేది నిజం.అలాగే సస్పెన్షన్లు కూడా గతం కన్నా బాగా పెరిగాయి.ఇదేగాక సభ వెలుపల చూస్తే వచ్చే ఎన్నికలలో విజయం గురించి పదేపదే చెబుతున్నారు. సర్వేలు విడుదల చేస్తున్నారు. పనిబాగాలేని వారిని ఎత్తిచూపుతూనే మెరుగుదలకు ి ప్రయత్నించాలని సర్దిచెబుతున్నారు. అన్ని తరగతులనూ సంతృప్తిపరిచే ప్రయత్నం మాత్రమే గాక స్వాములనూ దేవుళ్లనూ కూడా విస్త్రతంగానే సందర్శిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కెసిఆర్ ఫుల్ యాక్షన్మోడ్లోకి వచ్చేసినట్టే కనిపిస్తుంది.
మాటల తీరులో తేడా వున్నా చంద్రబాబు పరిస్థితీ ఇదే. అమరావతిలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ సమావేశాలలో ఆయన చాలా ఎక్కువ సార్లు జోక్యం చేసుకున్నారు. వివరణలు ఇచ్చారు విమర్శలూ చేశారు. పార్టీవారిని దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన కలిగించేందుకు ప్రయత్నించారు. అలాగే ఆయన కూడా వచ్చేఎన్నికల తర్వాత తనే ముఖ్యమంత్రిని అని సభలోనే చెప్పేశారు. తెలుగుదేశం అనూకూల పవనాలు వీస్తున్నాయన్న వాతావరణం తీసుకురావడానికి సంకేతాలిస్తున్నారు.వరుస ఘటనలు వివాదగ్రస్తమవుతున్నా పార్టీవారిని వెనకేసుకురావడానికి తప్పనిసరైతే లోలోపలే సర్దుబాటు చేయడానికి తంటాలు పడుతున్నారు. తనకు తోడుగా తనయుడిని కూడా తెచ్చుకున్నారు. కనుక ఎపి చంద్రుడు కూడా యాక్షన్ మోడ్లో ఇంకా చెప్పాలంటే హైపర్ యాక్షన్లో వున్నారని చెప్పొచ్చు.
మరి ప్రజల రియాక్షన్ మాత్రం తగు సమయంలో గాని తెలియదు.