అమరావతిలో రాజధాని రావడానికి తెలుగుదేశం నాయకుల భూముల కొనుగోలు కూడా ఒక కారణమని అందరూ అంగీకరిస్తారు. తాము భూములు కొనలేదని వారూ చెప్పడం లేదు. ఈ విషయంలో లోకేశ్ కూడా కొంత ఆగ్రహించినట్టు చెబుతారు. ఇవన్నీ అధినేతకు తెలియకుండా జరుగుతాయనుకోలేము. అయితే రాజధానికి వాస్తు కోణం ప్రధానంగా చూపించారు. రైతుల భూముల సమీకరణ, తిరిగి వాణిజ్య ప్లాట్ల కేటాయింపు సమస్యలు ఎలా వున్నా అనేక ప్రైవేటు సంస్థలకు ఉదారంగా ఎకరాలకొద్ది నామకార్థపు ధరకు కేటాయిస్తున్న మాట నిజం. వారంతా ఎప్పుడు సంస్థలు స్థాపిస్తారో తెలియదు గాని భూములపై హక్కు మాత్రం వచ్చేస్తున్నది. ఇది ఎప్పటికైనా చినికి చినికి గాలివాన కాకపోదు. అయితే ఈలోగానే విశాఖ పట్టణం భూకబ్జాలు శాసనసభలో దుమారం రేపాయి. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న బిజెపి శాసనసభా పక్ష నాయకుడు చంద్రబాబు సమర్థకుడు అయిన విష్ణుకుమార్ రాజు ఈ అంశం లేవనెత్తడం విశేషం. అందుకు ఆధారంగా సాక్షి చదవడం మరింత విశేషం. ఆ దశలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం చెబుతున్నా ఈనాడు కూడా చదివారు. వెయ్యి ఎకరాలు పాలక పక్ష ప్రముఖుల అండదండలతో స్వాహా అయిందని ఆయన వివరించారు. సమీకరణలో పోతుందని బెదిరించి భూములు తీసుకున్నారనేది ఆయన ఆరోపణ. మరోవైపున విశాఖకు చెందిన ఎంఎల్సి ఎంవిఎస్ శర్మ కూడా దాదాపు వెయ్యి ఎకరాల కబ్బాకు సంబందించిన వివరాలు బయిటపెట్టారు. గ్రంథాలయ ఆస్తుల విషయంలో మంత్రి గంటాశ్రీనివాసరావు పాత్రపై అదివరకటి నుంచి ప్రజాసంఘాలు పోరాడుతూనే వున్నాయి. ఇదంతా చూస్తుంటే విశాఖలో టిడిపి భూకబ్బా ఉచ్చులోచిక్కుకున్నట్టే కనిపిస్తుంది. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే సమస్య ఇంకా తీవ్రమవుతుంది.