పవన్ ఫ్యాన్స్‌కీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కీ పడదని మనకు తెలుసు. కానీ.. తెర వెనుక ఇంత కంటే బీభత్సమైన ఉద్రిక్త వాతావరణం ప్రభాస్ ఫ్యాన్స్‌కీ, పవన్ ఫ్యాన్స్‌కీ మధ్య సాగుతోంది. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ `సై` అంటే `సై` అనుకొనే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆ గొడవ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వరకూ పాకేసినట్టు కనిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ టైమ్‌లో భీమవరంలోని ఓ సెంటర్లో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ లాగేసిన ఘటన… భీమవరం అంతటా ఉద్రిక్తతకు దారి తీసింది. పవన్ , ప్రభాస్ ఫ్యాన్స్ కలబడి కొట్టుకొన్నారు కూడా. ఆ తరవాత అది సద్దు మణిగింది అనుకొంటే… దాని ప్రభావం కాటమరాయుడు సమయంలోనూ కనిపించింది. భీమవరంలో కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ పనిగట్టుకొని `కాటమరాయుడు అట్టర్ ఫ్లాప్` అనే టాక్ విడుదలకు ముందే తీసుకొచ్చేయడంలో సఫలీకృతమయ్యారు. సినిమా కూడా అంతంత మాత్రంగా ఉండడంతో.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ జోరుకు బ్రేకులు లేకుండా పోయాయి. పవన్ పై. పవన్ స్టైల్‌పై వెటకారపు పోస్టింగులతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.
మరోవైపు ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.. వెర్రితలలు వేసిన పవన్ ఫ్యాన్స్ ప్రత్యక్షమయ్యారు. బాహుబలి వేడుకలో సైతం పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ అరుస్తూ కూర్చున్నారు. పైగా.. ‘మేం పవన్ ఫ్యాన్స్’ అని చెప్పుకోవడానికి సింబాలిక్‌గా మెడలో ఎర్రకండువాలు వేసుకొన్నారు. ఎర్ర కండువా వేసుకొన్న ప్రతి ఒక్కడూ పవన్ ఫ్యాన్ కాకపోవొచ్చు. కానీ ఆ నింద మాత్రం వాళ్లపై పడుతోంది. రేపు బాహుబలి విడుదల సమయంలో వాళ్లు మరింతగా రెచ్చిపోవడం ఖాయం. ఇలా మరో హీరోనీ, వాళ్ల ఫ్యాన్స్‌ని తిట్టుకొంటూ, వాళ్లలో వాళ్లు కొట్టుకొంటూ… ఏమిటీ ఓవర్ యాక్షన్! తెర వెనుక బాహుబలి , కాటమరాయుడు ఇద్దరూ ఒక్కటే. వాళ్లు సినిమాలు చేసుకొంటారు. జేబుల నిండా డబ్బులు పోగేసుకొంటారు. పనీ పాట లేకుండా అభిమానం పేరుతో ఊగిపోయి, చొక్కాలు చించుకొని, దెబ్బలు తగిలించుకొని, డబ్బులు పోగొట్టుకొనే వెర్రి వెంగళప్పలు మనమే. ఈ విషయం అతి వీర భయంకరమైన ఫ్యాన్స్, ఆ పిచ్చిలో ఉన్న యువతరం గుర్తించుకోవడం మంచిది.