తెలుగుదేశం, భాజపా బంధం… ఉందంటే బలంగా ఉందని చెప్పుకోవచ్చు. లేదంటే బలహీనంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు! అయితే, దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం భాజపాకి తగ్గుతూ వస్తోంది. సోలోగా ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటోంది. ఇదే ట్రెండ్ లో ఈ మధ్య తెలంగాణపై కూడా అమిత్ షా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే, కాస్త బలంగా ప్రయత్నిస్తే తెలంగాణలో భాజపా పట్టు సాధించే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయన్నది వారి అంచనా. అయితే, ఈ క్రమంలో తెలుగుదేశంతో పొత్తు గురించి ఏం చేద్దాం అనే చర్చ మొదలైనట్టు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ చిటికెన వేలు పట్టుకుని తెలంగాణలో ఓ ఐదు స్థానాలను భాజపా దక్కించుకుంది. ఆ తరువాత, కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాష్ట్ర భాజపా నేతలు నిలిచారు. అయితే, పెద్ద నోట్ల రద్దు తరువాత కేసీఆర్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భక్తుల జాబితాలో చేరిపోయారు! ఉన్నట్టుండి జై మోడీ అనేశారు. సరే, తెరాస రాజకీయ ప్రయోజనాల కోణాన్ని కాసేపు పక్కనపెడితే… రాష్ట్రంలో భాజపా విస్తరణకు ఇదే మంచి అదనుగా భాజపా భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంతో తలాక్ చెప్పాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదే తరుణంలో రాష్ట్రంలోని సమస్యలపై.. ముఖ్యంగా కేసీఆర్ వైఫల్యాలపై ఉద్యమించేందుకు కూడా భాజపా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముస్లింల రిజర్వేషన్ల అంశమై ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది.
ఈ పరిణామాలు తెలుగుదేశంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంలో టీడీపీ ధీమా వేరుగా ఉందని చెప్పాలి. ఎందుకంటే, తెలంగాణలో భాజపా బలంగా కొన్ని చోట్ల ఉన్నట్టు అనిపిస్తున్నా… సొంతంగా ఎన్నికల్లో గెలిచేంత స్థాయి బలం ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. నిజానికి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో ముస్లింల జనాభా బలంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భాజపాకి కాస్త మంచి వేవ్ ఉంది. కానీ, ఏదో ఒక పార్టీ అండ లేకుండా భాజపా సొంతంగా ముందుకు సాగే పరిస్థితి అక్కడ లేదు. టీడీపీ ధీమా కూడా ఇదే.
ప్రస్తుతానికి భాజపా తలాక్ చెప్పే మూడ్ లో ఉన్నా, ఎన్నికలు వచ్చేసరికి మరోసారి ఆధారపడాల్సిన అవసరం ఉంటుందని టీడీపీ మనోగతంగా తెలుస్తోంది. అయితే, టీడీపీ ఇదే ధీమాతో ఉంటే కాస్త ఇబ్బందికరమే. ఎందుకంటే, భాజపాతో వీలైతే అధికారిక పొత్తు కుదుర్చుకునేందుకు తెరాస వేచి చూస్తోందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఒకవేళ పొత్తు తప్పనిసరి అయితే పరిస్థితి ఇంకోలా ఉండే ఛాన్సులూ ఉన్నాయి. భాజపా సైడ్ నుంచి ఆలోచించినా.. తెలంగాణలో భాజపాకి టీడీపీ కంటే తెరాస బలమైన మిత్రపక్షం అవుతుంది కదా! ఏదేమైనా టీడీపీతో తెగతెంపులకు భాజపా సిద్ధమన్న సంకేతాలే వెలువడుతున్నాయి. దీన్ని టీడీపీ ఎలా అర్థం చేసుకుంటుందనేది వేచిచూడాలి.