చంద్రబాబు పబ్లిసిటీ గిమ్మిక్స్ రోజు రోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా పట్టిసీమ అనే ఒక దేవతా వస్త్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల అక్షయపాత్రగా చూపించడం కోసం చంద్రబాబు చేస్తున్న కామెడీ ప్రయత్నాలు ఇప్పటికే ఎంతోమందికి నవ్వు తెప్పించాయి. పట్టిసీమకు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాల రికార్డ్ అయితే గిన్నీస్‌లోకి కూడా ఎక్కే అవకాశం ఉందేమో చూడాలి. ఇక రీసెంట్‌గా పట్టిసీమకు లిమ్కా బుక్ అవార్డ్స్‌లో చోటు దక్కిందనో…ప్రయత్నం చేస్తున్నామనో…అసలు విషయం ఏంటో అర్థం కాకుండా కాస్త హంగామా చేశారు. ఈ పట్టిసీమతో రాయలసీమకు ఇప్పటి వరకూ వచ్చిన నీళ్ళు ఎన్ని అనే విషయం గురించి మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు. కానీ పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం ఇరగదీస్తున్నాడు.
ఇప్పటి వరకూ చేసిన పబ్లిసిటీ స్టంట్స్ అన్నింటికంటే కూడా ఎన్నో రెట్లు గొప్పదైన స్టంట్‌ని ఈ రోజు చేసి చూపించాడు చంద్రబాబు. కృష్ణాడెల్లా ప్రాంతం రైతులంతా పట్టిసీమ ప్రాజెక్ట్ వళ్ళ వచ్చిన లాభాల వళ్ళ వచ్చిన ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారంట. ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా తెలియక గందరగోళంలో ఉన్నారట. వెంటనే వాళ్ళకు చంద్రబాబు గుర్తొచ్చారట. చంద్రబాబు కోసం పట్టిసీమ నీటితో పండించిన బియ్యంతో ప్రత్యేకంగా పాయసం చేశారట. ఆ పాయసం తీసుకుని వచ్చి చంద్రబాబు నోరు తీపిచేశారట. పట్టిసీమ ప్రాజెక్ట్‌తో డెల్టాను సస్యశ్యామలం చేసినందుకు కృతజ్ఙతగా ఉగాది సందర్భం గా పట్టిసీమ పాయసాన్ని చంద్రబాబుకు తినిపించారట. స్టోరీ అంతా చాలా బాగుంది. కానీ ఒక్కటే సందేహం. డెల్టా రైతులకు ఉన్నంత కృతజ్ఙత రాయలసీమ రైతులకు లేదా? రాయలసీమ రైతులకు చంద్రబాబు అంటే అభిమానం లేదా? పట్టిసీమ ప్రాజెక్ట్‌తో రాయలసీమను కూడా సస్యశ్యామలం చేసేశానని చెప్పేశాడు కదా చంద్రబాబు. చంద్రబాబు భజన కోసం ఇలాంటి వెరైటీ పబ్లిసిటీ స్టంట్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేసే జనాలకు రాయలసీమ రైతులు గుర్తురాలేదా? డెల్టా రైతులతో పాటు, రాయలసీమ రైతులు కూడా ఈ ప్రత్యేక పాయసం పబ్లిసిటీలో భాగమయి ఉంటే ఇంకా అదిరిపోయి ఉండేది కదా. ఏమంటారు బాబుగారు?