తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యత అనే ముద్ర ఎప్పుడో పడింది. దాన్ని మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అధినేత చంద్రబాబు నాయుడు. ఇతర సామాజిక వర్గాలకూ ప్రాధాన్యత ఉంటుందనే ఇమేజ్ కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ సందర్భమే వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముసిగింది. ఆశించిన ఆధిక్యాన్ని పార్టీ దక్కించుకుంది. ఈ లెక్క ప్రకారం మండలి ఛైర్మన్ పదవి టీడీపీకే దక్కించుకోవాలి. అయినాసరే, కాంగ్రెస్ కు చెందిన చక్రపాణి ఇంకా ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నాయకుడికి… ఏ సామాజిక వర్గానికి చెందినవారికి ఛైర్మన్ పదవి ఇవ్వాలనే చర్చ టీడీపీలో జోరుగా జరుగుతున్నట్టు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం… రెడ్డి సామాజిక వర్గానికి లేదా, క్షత్రియులకు అవకాశం ఇవ్వొచ్చనేది తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలో చాలామందికి టీడీపీపై వ్యతిరేకత ఉంది. పార్టీలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయం ఉంది. దీన్ని కవర్ చేయాలంటే మండలి ఛైర్మన్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వాలనేది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తోంది. ఆ లెక్కన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రేసులోకి వస్తున్నారు. పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, ఎన్నోయేళ్లుగా పార్టీకి అండగా ఉంటున్నారు. ఇప్పుడూ పార్టీకి తన స్థాయిలో మాట సాయం గట్టిగానే చేస్తున్నారు. సో.. సోమిరెడ్డికి ఛాన్సులున్నాయి.
ఆశావహుల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఉన్నారట! మండలి ఛైర్మన్ తనకు దక్కే అవకాశాలున్నాయని ఆయన ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అయితే, ఆయనకి ఛాన్సులు తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే, ఓ పక్క శాసన సభకు కోడెల స్పీకర్ గా ఉన్నారు. మండలిలో గాలికి అవకాశం ఇస్తే… అక్కడా ఇక్కడా ఒకే సామాజిక వర్గం నేతలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి, గాలికి ఛాన్సులు తక్కువే. ఇక, మిగిలింది ఉత్తరాంధ్రకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు! నిజానికి ఈయన ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఉత్తరాంధ్రాలో గ్రూపు రాజకీయాలు పెరుగుతున్న నేపథ్యంలో శత్రుచర్లను తెరమీదికి తీసుకుని వస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉన్నట్టు సమాచారం! దీంతో ఆయన పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది.
మొత్తానికి, కుల ముద్రను వదిలించుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ లెక్కన మండలి ఛైర్మన్ పదవికి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఛైర్మన్ పదవి రాజుగారికా, రెడ్డిగారికా అనేది త్వరలోనే తేలిపోతుంది.