ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు ఏంచేసినా ప్రపంచ స్థాయి ఆశిస్తారు! రాజధాని అమరావతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీలను ఆంధ్రాకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య దావోస్ వెళ్లొచ్చి.. ఇండియా అంటే ఆంధ్రా అనే స్థాయి బ్రాండ్ ఇమేజ్ పెంచుకొచ్చామన్నారు! ప్రపంచస్థాయి నేతలు తనని గుర్తిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కూడా అంతర్జాతీయ స్థాయి కల్పించారని చెప్పాలి! ఇన్నాళ్లూ జాతీయ ప్రాజెక్టు అని మాత్రమే అనుకున్నాం. కానీ, పోలవరం ప్రాజెక్టును ఇప్పుడు త్రీ గోర్జెస్ తో పోల్చారు. ఇది చైనాలో ఉంది. అంతర్జాతీయంగా ఇది చాలా ప్రముఖమైన ప్రాజెక్టు. పోలవరం కూడా అలాంటిదే అంటున్నారు.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందనీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ సమస్యలు తీరిపోతాయనీ చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. ప్రాజెక్టుపై ప్రెజంటేషన్ ఇస్తున్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఒక్క ప్రాజెక్ట్ పూర్తయితే చాలనీ, అన్ని జిల్లాల నీటి సమస్యలూ తీరిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది! ఈ రేంజి ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే ఏం చెయ్యాలీ… కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవాలి. వాస్తవంలో ఇంకా నిధుల కేటాయింపులు ఏంటనే ప్రశ్న ఇంకా ప్రశ్నగానే ఉంది. బడ్జెట్ లో కేటాయింపులు కూడా అంతంత మాత్రంగానే ఉన్న సంగతీ తెలిసిందే. అయినాసరే, మరో ఏడాదిలో దీన్ని పూర్తి చేస్తామంటున్నారు. చేస్తే మంచిదే. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలంటే ఎమ్మెల్యేలు ఏం చెయ్యాలో కూడా చంద్రబాబు చెప్పారు.
పోలవరం త్వరగా పూర్తి కావాలని ఎమ్మెల్యేలందరూ ప్రతీరోజూ ప్రార్థనలు చేయాలని చంద్రబాబు సూచించారు. కనీసం ఒక నిమిషం పాటైనా ప్రార్ధించాలన్నారు. అలా ప్రార్థనలు చేస్తే పని జరుగుతుందన్నట్టుగా చెప్పుకొచ్చారు..! అయినా.. ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందా చెప్పండీ. భక్తి విశ్వాసాలు ఆయనకు ఉంటే.. ఆ ప్రార్థనలు ఏదో ఆయనే చేసుకోవాలి. లేదంటే, కేసీఆర్ మాదిరిగా మొక్కులు మొక్కేసుకుని… ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ప్రభుత్వ ధనంతో ఎంచక్కా గుళ్లూ గోపురాలకు భారీ ఎత్తున కానుకలు ఇచ్చుకోవచ్చు. అంతేగానీ, ఎమ్మెల్యేలందరూ ప్రార్థనలు చేయాలనడం ఎంతవరకూ సరైంది..?
ఇప్పుడు పోలవరం కోసం ప్రార్థనలు చేయమంటున్నారు, రేప్పొద్దున్న అమరావతి కోసం దీక్షలు చేపట్టాలనీ, మరో పనికోసం ఉపవాసాలు చేయాలనీ, జాగరణలూ భజనలూ చేద్దామని ఎమ్మెల్యేలకు సూచిస్తారేమో..!