ఐఫా అవార్డు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని నావోటెల్ హోటెల్లో మంగళవారం రాత్రి తమిళ, మలయాళ చిత్ర రంగాలకు చెందిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రానా యాంకర్‌గా వ్యవహరించడం విశేషం. అవార్డు వేడుకలు ఈసారి కాస్త భిన్నంగా సాగాయి. రానా జోకులతో.. సరదాగా సెటైరికల్‌గా ఈ కార్యక్రమం నడిచింది. ఆహుతులకు వినోదం పంచడంలో భాగంగా.. కొన్ని అవార్డుల్ని జంతువులకు ఇచ్చారు. ఈమధ్య దక్షిణాది సినిమాల్లో జంతువుల వాడకం ఎక్కువైంది. దానిపై సెటైరికల్‌గా కొన్ని జంతువులకు అవార్డులు ఇచ్చారు. `ఈగ` సినిమాలో `ఈగ`కు ఉత్తమ బాల నటుడి అవార్డు దక్కింది. బాహుబలి ఏనుగుకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. ఉత్తమ విలన్‌గా మన్యం పులిలో హడలెత్తించిన పులిరాజాకి అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కేటరిగిరీలో జురాసిక్ పార్క్‌లో కనిపించిన డైనోసర్కి పురస్కారం వరించింది. అయితే… వాళ్లెవ్వరూ అవార్డులు తీసుకోవడడానికి రాలేదు లెండి. అది వేరే విషయం.
రెహమాన్ రాకతో ఈ వేడుకకు కొత్త కాంతులొచ్చాయి. అయితే కమల్‌హాసన్, విజయ్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్లు రాకపోవడంతో ఈ కార్యక్రమ కళ కాస్త తప్పింది. దాంతో పాటు ఆడియన్స్ కూడా చాలా పలచగా కనిపించారు. బుధవారం తెలుగు, కన్నడ సినీ రంగాల ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈకార్యక్రమానికి రానా, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. అఖిల్, సాయిధరమ్ తేజ్ డాన్సులు చేయబోతున్నారు. సో.. ఈరోజు మాత్రం ఐఫా కళకళలాడిపోవడం ఖాయం.