చంద్రబాబు రోజురోజుకీ బలహీనమయిపోతూ ఉన్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్స్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కనీస స్థాయి చర్యలు కూడా తీసుకోవడం లేదు. పుష్కరాల సందర్భంగా 30మందికి పైగా చనిపోయినప్పటికీ చర్యలు తీసుకున్నది లేదు. దివాకర్స్ ట్రావెల్స్ ప్రమాదంలో పదిమంది చనిపోతే కేసులే లేవు. అధికార పార్టీ ఎంపి, మంత్రులు కమిషనర్ స్థాయి అధికారిపై మాటలతో దాడిచేస్తే సారీ చెప్పించడంతో సరిపెట్టేశాడు చంద్రబాబు. ఇక టెన్త్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో కూడా చర్యలు ఏమీ ఉండవని చంద్రబాబు పరోక్షంగా చెప్పేశాడు.
ఆంధ్రప్రేదశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు. మరో టిడిపి మంత్రి నారాయణ స్వయానా విద్యాశాఖా మంత్రికి వియ్యంకుడు. భారీ ఫీజుల విషయం అయితేనేమి, విద్యార్థులను హింసించడంలో అయితేనేమి, విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో అయితేనేమి…. తరచుగా వార్తల్లో నిలుస్తున్న నారాయణ విద్యాసంస్థలు అధిపతి ఆయన. పదోతరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ఈ అధికార పార్టీనేతల పేర్లు బలంగా వినిపించాయి. అధికారంలో ఉన్నవారి హస్తం లేకుండా ఈ లీకేజీ జరిగే అవకాశమే లేదని స్పష్టంగా తెలుస్తోంది. బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం సినిమాల్లో బాలయ్య చెప్పేలాంటి డైలాగులతో సరిపుచ్చుతున్నాడు. ‘పిల్లల జీవితంతో ఆటలా….ఉపేక్షించను…….’ అని ఓ భారీ డైలాగ్ కొట్టాడు చంద్రబాబు. ఎంతగొప్పవారైనా వదలను అని కూడా చెప్పాడు. ప్రశ్నా పత్రం లీకేజీ విషయంలో చంద్రబాబు స్పందన ఆ డైలాగులకే పరిమితం అన్న విషయం ఆయన మాటల్లోనే తెలుస్తోంది. అసలు విషయాన్ని డైవర్ట్ చేసి లీక్ అయిన పేపర్ని డీఈవోకు వాట్సాప్‌లో పంపించిన సాక్షి విలేఖరిపై నింద వేయడానికి సిద్ధపడ్డాడు చంద్రబాబు. లీకేజీతో సంబంధం ఉండి ఉన్నవాడే అయితే ఆ లీక్ అయిన పేపర్ని డీఈవోకు ఎందుకు పంపిస్తాడు అన్న లాజిక్ మాత్రం చంద్రబాబుకు అనవసరం. రాష్ట్రంలో జరిగే ప్రతి క్రైమ్‌ని జగన్‌కి ఆపాదించాలన్న ప్రయత్నాలను టిడిపి నాయకులు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఆ మధ్య టిడిపి మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీలుడు ఓ స్కూల్ టీచర్ని హెరాస్ చేసిన విషయంలో కూడా జగన్ హస్తం ఉంది అని చెప్పిన ఘనులు టిడిపి నేతలు. తుని విధ్వంసం నుంచి ఇంకా ఎన్నో విషయాల్లో జగన్‌ని ఇరికించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ టిడిపి మాటలు నిజమే అయితే ఇన్ని తప్పులు చేస్తున్న జగన్‌ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు శిక్షించడం లేదు? ఆయనపైన కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు?
విషయం చాలా సింపుల్. 2014 తర్వాత నుంచి నారాయణ కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు? చంద్రబాబు ఎప్పుడైనా స్పందించాడా? టిడిపి ఎంపి దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ విషయంలో చంద్రబాబు చేసిన న్యాయం ఏంటి? ఇప్పుడు పదోతరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం కూడా అంతే. లీకేజీకి బాధ్యులయిన వాళ్ళను శిక్షించాలని వైకాపా డిమాండ్ చేస్తోంది కాబట్టి……వైకాపాకు మైలేజ్ పోకుండా ఉండాలంటే చంద్రబాబు కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి…….సినిమాలలో బాలయ్య స్టైల్లో ఓ రెండు భారీ డైలాగులు పేల్చాడు. జగన్‌ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. సాక్షిని కార్నర్ చేయాలని చూశాడు. లీకేజీ వ్యవహారంపై చంద్రబాబు స్పందన అంతటితో సరి. ఇకపైన లీకేజీ గురించి ఎలాంటి విచారణా ఉండదు. చర్యలూ ఉండవు. చంద్రబాబు హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు, బెదిరించాడు, అరిచి కేకలు పెట్టాడు అంటూ ఆయన భజన మీడియాలో వండి వారుస్తున్న వార్తలను పక్కనపెడితే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకూ టిడిపికి సంబంధించిన ఎవ్వరైనా సరే….ఎన్ని తప్పులు చేసినా సరే….వాళ్ళపైన ఎలాంటి చర్యలూ ఉండవు. ప్రపంచానికి పాఠాలు చెప్పిన ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు మార్క్ చట్టం అది.