కేరళలో పినరాయి విజయన్ నాయకత్వంలోసి ఎల్డిఎఫ్ ప్రభుత్వం నుంచి కొద్ది మాసాలలోనే ఇద్దరు మంత్రులు తప్పులు చేసి తప్పుకోవలసి రావడం రాజకీయ కళంకమే. మొదట సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు మంత్రి జయరాజన్ ఆశ్రితపక్షపాతం ఆరోపణల నేపథ్యంలో దిగిపోయారు. ప్రభుత్వ సంస్థలలో తన బంధువులకు సంబంధించిన వారిని సిఫార్సు చేసినట్టు ఆయనపై ఆరోపణ వచ్చింది. నియామకం నిజమని తేలిన వెంటనే విజయన్ జయరాజన్ను తొలగించాలనే నిర్ణయించారు. ఆ సంగతి అంటుండగానే ఇప్పుడు మరో మంత్రి శశీంద్రన్ అసభ్య సంభాషణం టేపులో దొరికి దిగిపోవలసి వచ్చింది. శశీంద్రన్ ఎన్సిపికి చెందిన వారే గాని కమ్యూనిస్టు కాదు. అయినామంత్రివర్గ సభ్యుడు గనక ఆయన నిష్మ్రమనను రెండవదిగా చూడవలసి వుంటుంది.ఇలాటి పరిణామం గతంలో 30 ఏళ్లకు పైబడి సిపిఎం వామపక్షాలు పాలించిన పశ్చిమ బెంగాల్లో గాని, ఒకరు విడిచి ఒకరు అన్నట్టుగా యుడిఎప్ ఎల్డిఎప్ పాలించే కేరళలో గాని గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. దేశంలో కమ్యూనిస్టుల బలం తగ్గుముఖం పడుతున్న పరిస్థితిలో పాలించే ఒకే పెద్ద రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఇలాటి చేదు అనుభవాలు రావడం పట్ల సిపిఎం నేతలు ఆందోళన చెందుతున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఎంతో మంచిపేరు తెచ్చుకోగా ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని పరిశీలన జరుపుతూ ప్రమాణాలు పాటించాలని హితవు చెబుతున్నారట.