ఈ సారి తెలంగాణ అసెంబ్లీ తీరుతెన్నులు గమనిస్తున్న మీడియా వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ తాజా వైఖరి ఏమిటో తెలిసిపోయింది. సభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు అయినప్పటికీ కీలకమైన అనేక అంశాలపై మంత్రి కెటిఆర్ దాదాపు అధికార హౌదాలో జవాబివ్వడం, దాడి చేయడం పదే పదే జరిగింది. ప్రాజెక్టులకు సంబంధించిన కాంగ్రెస్ ఆటంకాలపై హరీశ్‌కూడా మాట్లాడినా అందులో పదును అంతగా లేదు. మరోవైపు కెటిఆర్ మాత్రం మాటిమాటికి చర్చల్లో తలదూర్చి ఎవరికైనాఏదైనా చెబుతూ వెళ్లారు. హరిష్ మాట్లాడిన సందర్భాల్లో కూడా కెటిఆర్‌ను ప్రస్తావించిన పరిస్థితి. ఇంకో వైపున కెసిఆర్ మామూలుకుంటే ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల కూడా శాఖామంత్రికి పనిలేకుండా పోయింది. ఇలా సభను తండ్రీకొడుకులే హైజాక్ చేసేస్తుంటే హరీష్ రావు ఏమనలేని ఇరకాటంలో పడిపోయినట్టు చెబుతున్నారు. నీరు కన్నా రక్తం చిక్కన గనక కుమారుడికే వారసత్వం అనుకున్నా తనకు కూడా సముచిత స్థానం లేకపోతే ఎలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఆయనను ఇంటిదగ్గర ఎవరెవరు కలుస్తారనేది కూడా ఆరా తీస్తుండడంతో ఆ రద్దీలో తగ్గుదల వచ్చింది. ఇవన్నిటితో లోలోపల ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ టిడిపి నేతలు బాహుబలి వస్తున్నాడంటూ కథనాలు వదలడం,వాటిని హరీశ్‌కు ఆపాదించడం పులిమీద పుట్రలా మారింది. నిజంగా చాలా అసౌకర్యంగా కొన్నిసార్లు ఇబ్బందిగా కూడావున్నా హరీశ్ ఎలాటి దుస్సాహసం చేయబోరనే పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తగినంత కాలం టిఆర్‌ఎస్‌లో మంత్రివర్గంలో వుంటూనే తన పెనుగులాట కొనసాగిస్తారట. ఆయన లోపలే వుంటే నిర్ణయాత్మక అధికారం ఇవ్వకుండా పైపై వ్యవహారాలతో సరిపెట్టడానికి ముఖ్యమంత్రి కుటుంబం చాలా వ్యూహాత్మకంగా వుండాల్సి వస్తుంది. ఈ మధ్య కొడుకుల నుంచి మనవడు హిమాన్షు పేరు కూడా వినిపిస్తుంటే విస్తుపోతున్నట్టు చెబుతున్నారు.