రజనీకాంత్ – రాజకీయాలు అనేది పరమ ఓల్డ్ టాపిక్. అయినా ఎప్పటికప్పుడు దాని గురించి కొత్తగా మాట్లాడుకొంటారు. ఈమధ్య… ఈ టాపిక్ మరీ ఎక్కువైంది. జయలలిత మరణంతో తమిళనాట రాజకీయాల్లో ఓ గ్యాప్ ఏర్పడిందని, దాన్ని రజనీలాంటివాడే భర్తీ చేయాలని అక్కడ రాజకీయ విశ్లేషణలు వినిపించాయి. జయ మరణం తరవాత రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయమనుకొన్నారు. లేదంటే ఓ పార్టీకి మద్దతు తెలుపుతారని భావించారు. కానీ `నేనెవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు` అని నేరుగా ట్వీట్ చేయడంతో… ఆ ఊహాగానాలకు తెరపడింది. రజనీ రాజకీయాల్లోకి రాడన్న విషయం మరోసారి రూఢీ అయ్యింది. అయితే ఇప్పుడు రజనీ నుంచి ఓ కొత్త కబురు వచ్చింది.
ఏప్రిల్ 2న రజనీకాంత్ తన అభిమానులతో భేటీ అవ్వనున్నారు. పదేళ్ల తరవాత రజనీ తన ఫ్యాన్స్ మీట్ పెట్టడం ఇదే తొలిసారి. దాంతో ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యం సంతరించుకొంది. సాధారణంగా రజనీ తన ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉండడు. తన పుట్టిన రోజు సందర్భంగా… తన నివాసం బయటకు వచ్చి అక్కడకు వచ్చిన అభిమానుల్ని పలకరిస్తాడంతే. ఇది వరకు కొన్ని ఫ్యాన్స్ మీట్‌లు పెట్టాడు రజనీ. అయితే అవి కేవలం తన సినిమాల విడుదల సమయంలోనే. ఇప్పుడు రజనీ సినిమా ఏదీ విడుదలకు సిద్దంగా లేదు. పుట్టినరోజూ కాదు. అందుకే కచ్చితంగా రజనీ రాజకీయ ప్రకటన చేస్తాడని, ఏదో ఓ పార్టీ లో చేరడం గానీ, సొంతంగా పార్టీ పెట్టడం కానీ చేయొచ్చన్న ఊహాగానాలు అధికం అవుతున్నాయి. రజనీ సంచలన ప్రకటన చేస్తాడా? లేదంటే అలవాటు ప్రకారం మరోసారి తుస్సుమనిపిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.