ఓం నమో వేంకటేశాయ సినిమానే దర్శకేంద్రుడి ఆఖరి చిత్రం అనుకొంటున్నారంతా. కానీ.. ఆయన ఇన్నింగ్స్‌ని కంటిన్యూ చేసే ఉద్దేశంలోనే ఉన్నాడు. ఐఫా వేడుకలో ఓ ఇద్దరు హీరోల్ని తన సినిమాకి కమిట్ కూడా చేయించేశారు. ఆ ఇద్దరే రానా, నాని. ఐఫా వేడుకలో భాగంగా రాఘవేంద్రరావుకి జీవన సాఫల్య పురస్కారం లభించింది. ఈ సందర్భంగా అవార్డు అందజేసిన నాగార్జున మాట్లాడుతూ “రాఘవేంద్రరావు ఇక సినిమాలు చేయరని నేనే పొరపాటున అన్నా. నా మాట అబద్దం కావాలి.. ఆయన ఇలానే సినిమాలు చేస్తుండాలి“ అన్నాడు. దానికి స్పందించిన రాఘవేంద్రరావు ”ఇక్కడున్న నాని, రానాలు నాకు మాట ఇవ్వాలి. నా సినిమాల్లో నటిస్తానంటే… నేను వాళ్లతో ఓ సినిమా చేయడానికి రెడీ” అన్నారు. వెంటనే రానా, నానిలు ‘ఓకే’ అనేశారు. దాంతో రాఘవేంద్రుడి సినిమాకి కర్చీఫ్ పడిపోయినట్టైంది. అయితే… ఇలాంటి అవార్డు వేడుకల్లో ఇలాంటి ప్రపోజల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ఏదీ నిలబడదు. దీన్నీ ఆ కోవలో చేర్చేయొచ్చు. కాకపోతే వేదికపై ఇలాంటి దృశ్యాలు చూడ్డానికి, ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి.
అన్నట్టు అసలు విషయంలో కొద్దాం..! ఐఫా పుణ్యాన.. ఓ కొత్త విషయం తెలిసింది. రాఘవేంద్రరావు సినిమాలకు కూడా నాని సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అల్లరి బుల్లోడు సినిమాకి నాని అసిస్టెంట్ అట. ఆ సినిమాలో ‘త్రిషా..’ అనే పాటలో త్రిషపై పూలు చల్లింది నేనే అని గుర్తు చేసుకొన్నాడు నాని.