ఎందుకు మాట్లాడాల్సివచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఎప్పుడూ లేనిది ట్విట్టర్లో తెగ `కూత`లు కూశారు కీరవాణి. ఆయనంత అనుభవజ్ఞుడు, వివాద రహితుడు అసలు ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడాల్సివచ్చిందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆయన సొంత విషయాల గురించి ఎవ్వరి దగ్గర నుంచీ ఎలాంటి ఫిర్యాదులూ రావు.. రాలేవు. కానీ పరిశ్రమ గురించీ దర్శకుల గురించీ అందునా రచయితల గురించీ ఆయనచేసిన కామెంట్లు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. వేటూరి మరణం, సిరివెన్నెల అనారోగ్యం తరవాత.. తెలుగు సినిమా పాట పడకేసిందన్నారాయన. నిజంగా అది రచయితల్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే.
నిజానికి తెలుగు సినిమాలో సాహిత్యం ఈమధ్యే కాస్త మెరుగవుతోంది. శ్రీశ్రీ తరవాత జాతీయ స్థాయిలో అవార్డు అందుకొన్న రచయిత.. సుద్దాల అశోక్ తేజ. ఇయనేం భావదారిద్య్రంతో పాటలు రాయలేదే..?! చంద్రబోస్ మరీ లోతైన భావజాలం కురిపించకపోవొచ్చు గాక. ఆయన పాటలూ అర్థవంతంగా సాగినవే. ఇక రామజోగయ్య శాస్త్రి విషయానికొద్దాం. ట్రెండీ పాటలకు పెట్టింది పేరీయన. అదే సమయంలో ఎన్నో లోతైన, అద్భుతమైన పద సృష్టి కురిపించాడు తన పాటల్లో. సదాశివ సన్యాసీ పాట విని… నిజంగానే వేటూరినో, సిరివెన్నెలో రాసినంత సంబర పడ్డారు తెలుగు సినీ ప్రేమికులు. వీళ్లందరితోనూ కీరవాణి పనిచేశారు. ఇప్పుడు వాళ్ల ప్రతిభ తక్కువ అంచనా వేయడం దారుణాతి దారుణం.
వేటూరిస్థాయిలో గొప్ప పాటలు రావడం లేదంటే తప్పు ఎవరిది? మన రచయితల్లో ప్రతిభ లేక కాదు… అంతటి ప్రతిభావంతమైన గీతాలు రాసే అవకాశం దర్శకులు ఇవ్వక. త్రివిక్రమ్ సినిమాల్లో పాటలు మనసుకు హాయిగా తకుతాయి. బోల్డన్ని భావాలు పలికిస్తాయి. పదాల్లో లోతు కనిపిస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్ స్వతహాగా రచయిత. తన సన్నివేశానికి తగిన పాటలు ఎవరితో రాబట్టుకోవాలో అందులో ఎంత భావం ఉండాలో తనకు తెలుసు. మిగిలిన దర్శకులకు అంత టైమ్ లేదు. సాహిత్యంతో అవసరం లేదు. ఖాళీల్ని పూరిస్తే చాలులే అన్న రీతిన పాట తయారవుతోందిక్కడ. ఆ పాట ఎవరు రాస్తే ఏంటి??
కీరవాణి వ్యాఖ్యల పట్ల రచయితలంతా గరమ్ గరమ్గా ఉన్నారు. ఒకరిద్దరు బాహాటంగానే తమ అభిప్రాయం వెళ్లగక్కుతున్నారు. బాహుబలి 2లో పాటలు, అందులోని సాహిత్యం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఓ పాటలో వినిపించిన `హేస్సా రుద్రస్సా హేసరభద్ర సముద్రస్సా`అనే పదాలకు ఏమాత్రం అర్థం లేదని ప్రముఖ గీత రచయిత సిరా శ్రీ సోషల్ మీడియా సాక్షిగా రాసిన ఓ వ్యాసం ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ పాట రాసిందెవరో కాదు…సాక్షాత్తూ కీరవాణి తండ్రి శివశక్తి దత్తా. కీరవాణిపై గీత రచయితల పోరుకు ఇదే తొలి మెట్టు కావొచ్చు. తాను గీత రచయితల్ని అంతగా విమర్శించి… ఇప్పుడు వాళ్లతో మళ్లీ పనిచేయడానికి కీరవాణిముందుకొస్తాడా? ఒకవేళ కీరవాణి పిలిచి ‘పాట రాయండి’ అని అడిగితే.. సోకాల్డ్ కవులు ‘ఓకే’ అంటారా?? ఇది సినీ పరిశ్రమ… ఇక్కడ కోపతాపాలు, అలకలు మామూలే కావొచ్చు. కానీ ఈగోల మీద దెబ్బకొట్టకూడదు. అందులోని సరస్వతీ పుత్రుల దగ్గర. ఆ ఈగోనే ఇప్పుడు కీరవాణికి శత్రువుల్ని పెంచే అవకాశం ఉంది. కాదంటారా..??