బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని సామెత.దీన్నే కీడులో మేలు అనొచ్చు. దేశంలోనూ ప్రత్యేకించి తెలంగాణలోనూ రియల్ రంగంలో వచ్చిన స్లంప్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వరప్రసాదమైందంటున్నారు. రాష్ట్ర విభజన కన్నా డబుల్ బెడ్రూం ఇళ్ల వాగ్దానమే ఆయన అధికారంలోకి రావడానికి బాగా తోడ్పడింది. అయితే స్వంత నియోజకవర్గం దగ్గర ఎర్రవల్లిలో తప్ప మరెక్కడా ఈ డబుల్ బెడ్రూంల నిర్మాణం పెద్దగా జరగడం లేదు. హైదరాబాదులోనే లక్ష ఇళ్లు కడతామని జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినా అదీ నిజం కాలేదు.పదే పదే ప్రతిపక్షాలూ మీడియా ఆ సమస్య తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ డబుల్ వాగ్దానం అమలుకు సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నారు. బడ్జెట్లో కొద్దిపాటి కేటాయింపులు అంతకు మించి హడ్కో అప్పులు మొత్తం కలిపి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఇళ్లు కట్టాలని తలపెట్టారు. ఇతర పార్టీల వారి నియోజకవర్గాలతో సహా ఇప్పటికి రెండు వందలు నాలుగు వందల చొప్పున ఇళ్లు కట్టడానికి అనుమతులు ఇస్తున్నారు. ఈ నిర్మాణ వ్యయం గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.బాగా ఆలస్యమైంది. దాంతో ప్రభుత్వం గ్రామాలలో 5 లక్షల పైన, నగరాలలో 7 లక్షల పైన ఇస్తానని నిబంధనలు సవరించింది.అంతేగాక ఇసుక ఉచితంగా తీసుకుపోవచ్చని అనుమతించింది .సిమెంటు కంపెనీలను ఒప్పించి బస్తా 250 కే సరఫరా చేయిస్తుంది. అసలే వ్యాపారాలు సరిగ్గా లేని భవన నిర్మాతలు ఈ రాయితీల తర్వాత ముందుకు వస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా పల్లెలు చిన్న పట్టణాలలో ఆర్డర్లు లేని బిల్డర్లు దీన్ని అవకాశంగా తీసుకోవచ్చన్నది వారి ఆలోచన. పెద్ద బిల్డర్ల పేర్లతో ఔత్సాహికులు కూడా ముందుకు రావచ్చు. లేదా కింద చిన్నవారిని చూపిస్తూ పైన పెద్ద వాళ్లే వుండి గుండుగుత్తగా చేయించడం ద్వారా లాభం పొందొచ్చు. ఆ విధంగా 70వేల ఇళ్లు కడతామని వూరిస్తున్నారు.అందులో కొంత వరకూ కట్టినా ప్రజలలో ఆశలు పెంచడానికి ఓట్లు పొందడానికి సరిపోతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నగరం కెటిఆర్ పరిధిలోకి వస్తుంది గనక అక్కడ ఒక్కచోట లక్ష ఇళ్లుకట్టిస్తామని ప్రకటిస్తున్నారు. ఇవన్నీ నిజంగా జరుగుతాయా అంటే అంత సులభం కాదు గాని ప్రక్రియ మొదలు పెట్టి ప్రజలలో కాస్త నమ్మకం కలిగించడం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది.