రీమేక్ కథల్లో ఉన్న సుఖమే సుఖం. కథేంటో తెలుసు. ఎలా నడపాలో తెలుసు. అందులో ప్లస్సులు తెలుసు.. మైనస్సులు ఇంకా బాగా తెలుసు. కాస్త బద్దకస్తులైతే డీవీడీ ముందు పెట్టుకొని సినిమా తీసేస్తారు. అదే తెలివైన వాళ్లతే ప్లస్సుల్ని ఇంకా ఎలివేట్ చేస్తూ.. మైనస్సుల్ని సాధ్యమైనంత కనిపించకుండా జాగ్రతత్త పడతారు. రిజల్ట్ సూపర్ హిట్ కాకపోవొచ్చు. కానీ ప్రయత్న లోపం లేకుండా తీస్తే.. మెచ్చుకోదగిన ప్రయత్నంగానైనా మిగిలిపోతుంది. బహుశా.. ఇన్ని ప్లస్సులు ఉన్నాయి కాబట్టే వెంకటేష్ ఎక్కువగా రీమేక్‌ల వైపు దృష్టి పెడుతుంటాడేమో! ఇప్పుడు వెంకీ నుంచి మరో రీమేక్ వచ్చేసింది. అదే.. ‘గురు’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈమధ్య సినిమాలు తెగ ఆడుతున్నాయి. ఆ ట్రెండ్ తెలుగులోనూ తీసుకురావాలన్న ఉద్దేశ్యమో, ఏమో…. వెంకీ ఈ సినిమా బాధ్యతని తన భుజాలపై వేసుకొన్నాడు. మరి ఆ బరువు మోయగలిగాడా?? జనరంజకరమైన సినిమాని ఇవ్వగలిగాడా? రీమేక్‌కి వెంకీ చేసిన న్యాయం ఎంత? ఇవన్నీ లెక్కలు తేలిస్తే…
కథ
ముందుగా కథలోకెళ్దాం… వెంకీ కి బాక్సింగ్ అంటే ఇష్టం. ఇష్టమనే మాట కూడా చిన్నదే. బాక్సింగ్ అంటే ప్రాణం. అయితే అకాడమీలో ఉన్న రాజకీయాల వల్ల బాక్సర్‌గా ఎదగలేకపోతాడు. కోచ్‌గా మారినా ఇదే పరిస్థితి. తన కోపం వల్ల, నిజాయతీ వల్ల ఎక్కడా కుదురుగా ఓ చోట నిలవలేడు. చివరికి ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖ పట్నంలో అమ్మాయిల టీమ్ కోచ్‌గా వెళ్తాడు. అక్కడ రితిక సింగ్‌ని చూస్తాడు. ఆ అమ్మాయి చదువుకోలేదు. జీవితంపై పెద్ద అంచనాలూ లేవు. తన దూకుడు వెంకీకి నచ్చతుంంది. ‘చిన్నప్పుడు నేనూ ఇలానే ఉండేవాడ్ని కదా’ అనిపిస్తుంది. తనని బాక్సర్‌గా తీర్చిదిద్దుదామనుకొంటాడు. కూరగాయలు అమ్ముకొనే ఓ పెంకిదాన్ని… దేశం మెచ్చే బాక్సర్‌గా హీరో ఎలా తయారు చేశాడన్నదే.. ఈ సినిమా కథ.
విశ్లేషణ
సాలా ఖడూస్ చూసుంటే… ఆ సినిమా తాలుకూ జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని మర్చిపోయి. పోలికల్ని పక్కన పెట్టి ఈ సినిమా చూడాలి. లేదంటే ఎంజాయ్ చేయలేం. సాలా ఖడూస్ కథ, స్క్రీన్ ప్లే, అక్కడి ఎమోషన్స్ ఇవన్నీ తెలుగులోనూ తర్జుమా చేయాలన్న ఉద్దేశంతోనో ఏమో… సుధా కొంగర పెద్దగా మార్పులేం చేయలేదు. మాతృక కి దర్శకత్వం వహించిందీ తనే కాబట్టి, తన కంటికి అక్కడి మైనస్సులు పెద్దగా కనిపించలేదేమో! తన కథపై (ఆల్రెడీ అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టి) నమ్మకం మరింత పెరిగి.. మక్కీకి మక్కీ దించేసింది. ఆఖరికి లొకేషన్లు కూడా పెద్దగా మారలేదు. ఓ సీన్లో అకాడమీ హెడ్.. శాండ్ విచ్ తింటూ.. హీరోతో కోచ్ పదవికి రాజీనామా చేయిస్తాడు. ఆ ప్లేసూ మారలేదు. టేబులూ మారలేదు. ఆఖరికి తినే శాండ్ విచ్ కూడా. అరె.. ఎంత మక్కీకి మక్కీ తీయాలన్న తాపత్రయం ఉంటే మాత్రం చిన్న చిన్న సీన్లని కూడా కార్బన్ కాపీలా తీస్తే ఎలా..? అంతెందుకు.. సాలా ఖడూస్లో ఉన్న షాట్స్‌ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. ఎందుకంటే వెంకీ తప్ప.. మిగిలిన వాళ్లంతా అక్కడ నటించినవాళ్లే. అవే సీన్లని ఇక్కడా వాడుకొన్నారన్నమాట. బహుశా నటీనటుల్ని ఎక్కువగా రీప్లేస్ చేయకపోవడానికి కారణం అదే కావొచ్చు. అక్కడి సీన్లు వాడుకొంటే వాటిని షూట్ చేయాల్సిన పని లేదు. డబ్బులు కలిసొస్తాయి. తక్కువ రోజుల్లో తీసేయొచ్చు. ఈ సినిమాని 50 రోజుల్లో పూర్తి చేయడానికి కారణం ఇదే.
అయితే మాతృక చూడనివాళ్లకు ఇవేం పెద్ద దోషాలుగా అనిపించవు. కాబట్టి…. కథనీ, ఆ ఫ్లోనీ ఫాలో అయిపోతారు. రీమేక్ సినిమాల్లో అదే కథ, అవే సీన్లతో మళ్లీ తీసినా ఎమోషన్ మిస్సవుతూ ఉంటుంది. కానీ గురులో ఆ లోపం కనిపించలేదు. రీమేక్ సినిమాల్లో నటించిన అనుభవమో ఏమో.. వెంకీ ఆ లోటు కనిపించకుండా చేయగలిగాడు. శిష్యురాలిని తీర్చిదిద్దడానికి గురువు చేసే ప్రయత్నాలు, రితికా సింగ్ అల్లరి… వీటి మధ్య సాగే ఫస్ట్ ఆఫ్ చకచక నడుస్తుంది. అప్పుడే ఇంట్రవెల్ వచ్చేసిందా… అనేలా మ్యాజిక్ చేసింది దర్శకురాలు. కథానాయికని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌గా చూపించడం.. పవన్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడానికే. బీ,సీల్లో ఆ ప్రభావం కనిపించొచ్చు. సెకండాఫ్ కాస్త నెమ్మదించింది. రాములు తన తప్పు తెలుసుకొని, ఓ మంచి బాక్సర్ గా మారే ప్రయత్నం.. పతాక దృశ్యాలు ఆకట్టుకొంటాయి. అయితే క్లైమాక్స్‌లో మాత్రం అణువణువూ సుల్తాన్, దంగల్ల సన్నివేశాలే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సినిమాల కంటే.. ముందు రాసుకొన్న కథ ఇది. కాకపోతే… దంగల్, సుల్తాన్ లతో పోలికలు వెదుక్కొనే ప్రమాదం ఉంది. స్పోర్ట్స్ డ్రామాలతో వచ్చే చిక్కే ఇది. వాటి స్క్రీన్ ప్లే దాదాపుగా ఒకేలా ఉంటుంది. కాబట్టి.. క్లైమాక్స్‌లో ఏం జరగబోతోందో ముందే ఊహించగలిగాడు ప్రేక్షకుడు.
నటీనటుల ప్రతిభ
వెంకటేష్ గురించి చెప్పేదేముంది? తన ప్రయత్న లోపం లేకుండా నటించాడు. నిజానికి ఈ పాత్రలో వెంకీని తప్ప మరొకర్ని ఊహించలేం. హీరోయిజాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఆ ఇమేజ్‌ని వదిలి, ఇలాంటి ప్రయత్నాలు చేయగలిగే ధైర్యం వెంకీకి మాత్రమే ఉందన్నది మరోసారి రుజువైంది. రితిక ది హీరోకి ఏమాత్రం తీసిపోని పాత్ర. అడుగుడుగునా మెప్పిస్తుంది. నాజర్ అక్కడక్కడ కాస్త ఓవర్ చేశాడు. రఘుబాబు కూడా అంతే. మిగిలిన పాత్రలకు పెద్ద ప్రాధాన్యం లేదు.
సాంకేతికంగా చెప్పుకోవాల్సివస్తే…. పాటలకంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఆకట్టుకొంటుంది. వెంకీ పాడిన పాట బాగుంది. అమ్మాయిలిద్దరిపై తెరకెక్కించిన పాట.. బీట్ ప్రధానంగా సాగింది. సుధా కొంగర కథ, స్క్రీన్ ప్లేలలో పెద్దగా మార్పులు చేయలేదు. చేసుంటే బాగుండేది అనిపించింది. మూల కథని ఎంచుకొని.. వెంకీ శైలికి తగ్గట్టు చేస్తే మాతృక చూసినవాళ్లకూ ఓ కొత్త రకమైన సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగేది. అయినా ఫర్లేదు… రీమేక్‌లు తెరకెక్కించడం అంత ఈజీ కాదు. ఆ విషయంలో ఆమె ప్రతిభని మెచ్చుకోవాల్సిందే.
ఫైనల్ టచ్ : చూసేద్దాం చలో…. ‘గురు..’
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5