ఆయన అంటే ప్రధానికి గాని వెనకవుండి నడిపించే ప్రధాన శక్తి ఆరెస్సెస్ నేతలకు గాని ఇష్టం లేదని చెబుతుంటారు. కీలకమైన శాఖలు బాధ్యతలు లేకుండా చేశారు. అయినా తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆయనే పెద్దదిక్కుగా చలామణి అవుతున్నారు. ఆయన వ్యక్తిగత కేంద్రీకరణ, ఆశ్రిత పక్షపాత ధోరణి, అనవసర వివాదాస్పద వైఖరి, చంద్రబాబునూ చంద్రశేఖరరావునూ వూరికే పొగడ్డం వంటివి ఎపి తెలంగాణలలో చాలా మంది బిజెపి నేతలకూ నచ్చడం లేదు. ఆయన కారణంగానే తాము స్వంతంగా ఎదగడానికి పునాది పడటం లేదని వారంతా ఆరోపిస్తారు.ఈ మాటే పైన చెబుతుంటారు కూడా. అయితేనేం.. మళ్లీ అన్యథాశరణం నాస్తి అంటూ ఆయనే దిగిపోతారు.తన విస్త్రత సంబంధాలతో పరిచయాలతో ఏదో హడావుడి చేసి మీడియాలో సందడి చేసి వెళ్లిపోతారు. ఆయన కుమార్తె నడిపే ఎన్జీవో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తూనే వుంటుంది. కుమార్తెను రాజకీయాల్లోకి తేలేదని,ప్రభుత్వ నిధులు నయాపైసా తీసుకోలేదని సూక్తులు చెబుతుంటారు గాని ప్రభుత్వం దగ్గర భారీ కాంట్రాక్టులు చేసేవారంతా ట్రస్టులో సభ్యులుగా వుంటారు. ముఖ్యమంత్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులూ వరసగట్టి పాల్గొంటారు. ఇదంతా ఒక వలయం. సహించలేక ఎవరైనా వె ళ్లి ఫిర్యాదు చేశారా వారిపై ఒత్తిళ్లు వేధింపులు పితూరీలు మొదలవుతాయి. కావాలంటే తెలుగుదేశం వైపు నుంచి కూడా ఫిర్యాదులు చేయిస్తారు. కనుకనే ఎందుకొచ్చిన గొడవ అని చాలా మంది సర్దుకుంటూ వుంటారు.ఇప్పటికీ ఆయన పట్టు ఎంత ఎక్కువగా వుందంటే తెలంగాణలో బిజెపి అద్యక్షుడుగా ఆయనకు ఇష్టమైన లక్ష్మణ్ ఎంపికయ్యారు. అదే స్వంత రాష్ట్రమైన ఎపిలో మాత్రం నచ్చినవారు కుదరక, పైనుంచి సూచించిన వారు ఆయనకు నచ్చక అలా సాగిపోతూనే వుంది. రాష్ట్ర పార్టీ అద్యక్షుడి ఎంపికే చేసుకోలేని వాళ్లం అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఏమిస్తామని పార్టీలో పలువురు వాపోతుంటారు. అయినా సరే వెంకయ్య వాయిదాకైనా ఒప్పుకుంటారు గాని నచ్చని వారిని రానివ్వరు. ఇదంతా చూసి తట్టుకోలేక పార్టీ యువనాయకుడు ఒకరు వెళ్లి నేరుగా ఆరెస్సెస్ ఇన్ఛార్జిని అడిగారట. ఏం చేస్తాం వెంకయ్యకు రీప్లేస్మెంట్ దొరకడం లేదు అన్నది వారి జవాబు. మురళీధరరావు,రామ్ మాధవ్ వంటి వారు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్లినవారే అయినా ఇక్కడ సరిపోరు. ఇక బండారు దత్తాత్రేయకు అంత సీన్ లేదు. సో ఇప్పటికైతే వెంకయ్య పండుగ చేసుకోవడమే!