కొంతమంది దర్శకుల్ని మారమని అడక్కూడదు. వాళ్ల నుంచి మార్పూ ఆశించకూడదు. వాళ్ల స్టైల్‌లో తీసుకొంటూ వెళ్లిపోతారు. మనకు నచ్చితే చూడాలి… లేదంటే లేదు. ఎందుకంటే ఆ స్టైలే వాళ్లకు గుర్తింపు తీసుకొచ్చింది కాబట్టి. దాన్ని అంత తేలిగ్గా వదల్లేరు కాబట్టి. పూరి జగన్నాథ్ కూడా అంతే. ఆయన సినిమాల్లో హీరో ఎప్పుడూ ఒకేలా ప్రవర్తిస్తాడు. కాన్‌ఫ్లిట్ కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. దాని చుట్టూ అవే సన్నివేశాలు పుట్టుకొస్తాడు. కాకపోతే డోసేజీల్లో తేడా ఉంటుంది. `రోగ్` కూడా అంతే. పూరి గత సినిమాల ఛాయలు ఈ సినిమాపై కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. హీరో మారాడు. లొకేషన్లు మారాయి. అంతే…పూరి యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదు. అదే… `రోగ్` సినిమా. ఈ`రోగ్` గురించి ఇంకాస్త డిటైల్డ్ గా చెప్పుకొంటే…
కథ
చంటి (నిషాన్) కమీషనర్ కూతురు అంజలి (ఏంజిల్)ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ తాను మాత్రం… ఇంట్లోవాళ్లు చూసిన సంబంధం చేసుకొంటుంది. ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడమే కాదు, జైలుపాలు కూడా అవుతాడు చంటి. అప్పటి నుంచీ అమ్మాయిలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. జైలు నుంచి వచ్చిన తరవాత తన వల్ల జీవనాధానం కోల్పోయిన కానిస్టేబుల్ (సత్య) కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఇంటి అమ్మాయి అంజలి (మన్నార) చంటిని ఇష్టపడుతుంది. కానీ ఓ సైకో (అనూప్ సింగ్) కన్ను అంజలిపై పడుతుంది. అంజలిని కాపాడడానికి చంటి ఏం చేశాడు?? వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా?? అనేదే `రోగ్` కథ.
విశ్లేషణ
పూరి కథకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడు. అది తెలిసిన విషయమే. `రోగ్`లోనూ అంతే. కథని కథగా చెప్పుకొంటే .. అందులో కట్టి పడేసే విషయాలేం ఉండవు. కొత్త కథా కాదు. అయితే పూరి మార్క్ టేకింగ్, క్యారెక్టరైజేషన్లు తెరపై కనిపిస్తాయి. సూటిగా కథలోకి వెళ్లిపోవడం ఒక్కో పాత్రని పరిచయం చేయడం.. జైలు సన్నివేశాలు, ఆ తరవాత కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకోవడం, అక్కడ మరో ప్రేమ కథ, సైకో వ్యవహారాలు… ఇలా ఫస్టాఫ్ కి ఎక్కడా పుల్ స్టాప్ ఉండదు. అంత ఫాస్ట్‌గా నడిచిపోతుంది. ఇంట్రవెల్ ముందొచ్చే సీన్లు యధావిధిగా సెకండాఫ్‌పై ఆసక్తి కలిగిస్తాయి. ఫస్టాఫ్ చూశాక.. పూరి నుంచి కొత్త సినిమా రాబోతోందా? పూరి ఈ సారి హిట్ కొట్టేస్తాడా?? అనే నమ్మకాలు కలుగుతాయి. అయితే.. సెకండాఫ్ మొదలైన కాసేపటికే.. పూరి ఏం మారలేదనిపిస్తుంది. లాజిక్‌కి అందని సన్నివేశాలు సెకండాఫ్‌లో కోకొల్లలు. ఓ సినిమా చేస్తున్నప్పుడు `దీన్ని ఫ్యామిలీస్ చూస్తారా? లేదా?` అనే లెక్కలేం వేసుకోడేమో పూరి. ఫ్యామిలీ ఆడియన్స్ లేచి వెళ్లిపో గలిగే కొన్ని షాట్స్ టక టక పడుతుంటాయి. విలన్‌కి ఓవర్ బిల్డప్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనో ఏమో… శాడిజాన్ని వీరలెవిల్లో చూపిస్తారు. కొన్ని డైలాగులు బాగానే ఉన్నా.. అతిగా అనిపిస్తుంటాయి. అందుకే సెన్సార్ వాళ్లు కూడా ఎక్కువ బీప్ లు వేసుకోవాల్సివచ్చింది. సెకండాఫ్ తన ఇష్టం వచ్చినట్టు చక్కర్లు కొడుతూ కొడుతూ.. చివరికి పూరి సినిమా ఎలా ముగుస్తుందనుకొంటారో.. అలానే ముగుస్తుంది. మొత్తంగా హీరోయిజం, కొన్ని డైలాగులు, సినిమాలో రిచ్ నెస్… వీటి ని హైలెట్ చేస్తూ.. కుర్రకారుకి కాస్త నచ్చేలానే రోగ్‌ని తీర్చిదిద్దాడు పూరి. అలాగని ఇది పూరి నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటిగా జమ చేయాల్సిన అవసరం లేదు. ఈమధ్య పూరి నుంచి వచ్చిన డిజాస్టర్ల కంటే.. బెటర్ అవుట్ పుట్ అనుకోవాలంతే. నిజంగా సెకండాఫ్ పై కూడా పూరి శ్రద్ద పెట్టుంటే… పూరి నిరీక్షణకు తగిన ఫలితం దక్కేదేమో.
నటీనటులు
ఇషాన్ ఈ సినిమాతో అరంగేట్రం చేశాడు. తన ఈజ్, బాడీలాంగ్వేజ్ ఆకట్టుకొంటాయి. ఓ మంచి మాస్ హీరో అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. సరైన కథ పడితే.. ఇప్పుడున్న హీరోల్ని పక్కకు నెట్టేసే స్టామినా ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా… మన్నార్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. పాటల్లో అందంగా కనిపించింది. అనూప్ కూడా ఆకట్టుకొంటాడు. అయితే పూరి అనూప్‌తో మరీ ఓవర్ చేయించాడు. పోసాని, అలీ… ఓకే. మిగిలిన వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏం లేదు.
సాంకేతికంగా…
సునీల్ కాశ్యప్ పాటలు వినడానికి బాగున్నా.. మాసీగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సినిమా ఏమో మాస్. తన పాటలేమో క్లాసిక్ టచ్‌తో సాగాయి. సినిమా రిచ్‌గా ఉంది. ఓ పెద్ద హీరో కోసం ఎంత ఖర్చు పెడతారో… అంతే పెట్టారు. పూరి లో కథకుడు బొజ్జుంటే.. సంభాషణ రచయిత తన పవర్ చూపించాడు. చాలా కాలం తరవాత కొన్ని డైలాగుల్ని మనసు పెట్టి రాశాడేమో అనిపిస్తుంటుంది. అయితే.. సెకండాఫ్‌లో తన పైత్యం మొత్తం చూపించడంతో హిట్టు అందుకొనే అపురూపమైన అవకాశాన్ని నిర్లక్ష్యంగా చేజార్చుకొన్నాడనిపిస్తుంది.
ఫైనల్‌గా… ఈ రోగ్ లోఫర్‌కి ఎక్కువ… ఇడియట్‌కి తక్కువ
తెలుగు360.కామ్ రేటింగ్ 2/5