అక్రమ ధనాన్ని వెలికి తీసేందుకు దేశ వ్యాపితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) సాగించిన దాడులలో ప్రముఖంగా వినిపించిన పేరు రాజేశ్వరి ఎక్స్‌పోర్టు ప్రైవేటు లిమిటెడ్. దీని ద్వారా దిగుమతుల విలువ కొన్నిరెట్లు ఎక్కువగా చూపించి డబ్బును విదేశాలకు తరలించారనేది ఆరోపణ. గత ఏడాది డిసెంబరు చివరలోనే ఇలాటి సమాచారం వచ్చింది. 2017 జనవరి హాంగ్కాంగ్నుంచి పనిచేసే ఇంటర్నేషనల్ రైజింగ్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి కృతికా దహాల్ను ఇడి అధికారులు అరెస్టు చేశారు. ఆ కంపెనీ నుంచి వజ్రాలు నగలు రాజేశ్వరి లిమిటెడ్ దిగుమతి చేసుకున్నట్టు చూపించి 1400 కోట్లు తరలించారని అనుమానిస్తున్నారు. ఆ దిగుమతివిలువను పది రెట్టు అధికంగా చూపడమే గాక వందకోట్లకు పైగా అనధికారికంగా చెల్లింపులు చేసినట్టు ఇడి చెబుతున్నది. నిజానికి కృతిక ఇంటర్నేషనల్ రైజింగ్ సంస్థలో 99..99 శాతం వాటాలు కలిగివున్నారు. తనను రితేష్జైన్ నియమించినట్టు ఆమె చెబుతున్నారు. ఇక రాజేశ్వరి లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా వున్న ప్రశాంత్ విజరు పవార్, సుజాత్ దేవ్‌కుమార్ ఖర్జో కూడా జీతానికే వున్నారట. ఇదంతా ఒక గూడుపుఠానీ అని అక్రమ ధనాన్నితరలించడానికి ఉత్తుత్తి ఎగుమతి దిగుమతులు చూపిస్తున్నారని ఇడి అధికారులు వెల్లడించారు. అంతేగాక రాజేశ్వరి సంస్థకు వైసీపీ నేత జగన్‌తో సంబంధాలు వున్నాయని ఇడి వర్గాలు చెప్పినట్టు హిందూస్తాన్ టైమ్స్ తదితర పత్రికలు రాశాయి. తెలుగుమీడియాలోనూ ఈ వార్త ఒక్కసారిగా గుప్పుమన్నది.వాస్తవానికి గత డిసెంబరులోనూ, జనవరిలోనూ కృతిక అరెస్టు వార్తలు ప్రముఖంగావచ్చినప్పుడు పట్టించుకోని తెలుగు మీడియాకు ఇప్పుడు ఇది సంచలన సమాచారంగా మారింది. దీంతోపాటే ముంబాయిలో మొత్తం 700 బూటకపు కంపెనీలపై దాడులు చేశారు. ఇందులో కొన్ని మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సిపి నేత చగన్ భుజబల్రు చెందినవని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన గతంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 16 రాష్ట్రాలలో 300 చోట్ల జరిగిన ఈ దాడులలో ఇంకా అనేక సంచలనాలు వెలుగు చూసే అవకాశం వుంది.ఇటీవలనే సిబిఐ జగన్ బెయిలు రద్దుకోసం పిటిషన్దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కథనాలు రావడం రాజకీయంగా దెబ్బగానే చెప్పాల్సి వుంటుంది.