చంద్రబాబు నాయుడు మంత్రివర్గ మార్పులు అలుకలు, బుజ్జగింపులు వగైరాలపై కథనాలు నడుస్తున్నాయి. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వూహించిందే గాని దేశమంతటా ప్రాంతీయ పార్టీల భగవద్గీత ప్రకారమే జరిగింది. ఒమర్ అబ్డుల్లా, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, ఓం ప్రకాశ్ చౌతాలా ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కుమారుల సంఖ్య సుమారుగానే వుంది. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ,కరుణానిధి కుమారుడు స్టాలిన్ వంటివారు ఉప ముఖ్యమంత్రుల వరకూ ఎదిగారు. ఈ జాబితాలోకి వచ్చేవారు ఇంకా వుండొచ్చు కూడా. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం తండ్రి ముఖ్యమంత్రిగా వుంటే కుమారుడు మంత్రి కావడం గతంలో జరగలేదు. అల్లుళ్లు మంత్రులైన ఉదాహరణలున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడైన కెటిఆర్‌ను కూడా అల్లుడు హరీశ్‌రావుతో పాటు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎపిలో మొదటి సారి అమరావతిలో చంద్రబాబు ఆ పనిచేశారు. ఇందుకు కారణమేమిటని పరిశీలిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచినేర్చుకున్న పాఠమేనని చెప్పాలి. వైఎస్ మరణానంతరం జగన్ తిరుగుబాటు చేసినపుడు చాలా మంది నేతలు కాంగ్రెస్‌లోనే వుంటే ఆయన ఎప్పటికీ అధికారంలోకి రాలేడని చెబుతుండేవారు. ఒక్క ముఖ్యమంత్రి కుమారుడైనా తండ్రి వుండగా మంత్రివర్గంలోకి రాగలిగారా అని ప్రశ్నించేవారు. మర్రి శశిధరరెడ్డి, జలగం వెంకటరావు, కోట్ల సూర్యప్రకాశరెడ్డి వంటి వారంతా అరకొర పదవులతో తృప్తిపడటం తప్ప నాయకత్వంలోకి రాలేకపోయారనీ,జగన్ అలా కాకూడదనుకుంటే ఏదో ఒక పోరాటం చేస్తుండవలసిందేనని వైసీపీ నేతలు చెబుతుండేవారు. ఇంచుమించి చంద్రబాబు నాయుడు కూడా ఆ సూత్రాన్నే అనుసరించారు. తను వుండగానే లోకేశ్‌ను మంత్రిని చేస్తే తన తర్వాత ఎలాగూ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశ, ఆశయం.