చిరంజీవి దృష్టంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పైనే ఉంది. ఈ సినిమాని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని తహతహలాడుతున్నాడు. అయితే.. స్క్రిప్టు పక్కాగా ఉంటే తప్ప.. సినిమాని మొదలెట్టని తత్వం చిరుది. అందుకే ఇప్పుడు కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. చిరు నుంచి వచ్చే 151వ చిత్రమిది. కథ, అందుకు తగిన మాటలతో ఎప్పుడో బౌండెడ్ స్క్రిప్టుని తయారు చేసేశారు పరుచూరి సోదరులు. దానికి సురేందర్ రెడ్డి కొన్ని మార్పులు, చేర్పులూ జోడించి ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాడు కూడా. అయితే.. డైలాగ్స్ విషయంలో చిరు అంత సంతృప్తికరంగా లేడని తెలుస్తోంది. అందుకే.. ఫైనల్ వెర్షన్ రెడీ చేసే ముందు.. ఓ ప్రతిభావంతుడైన రచయిత చేత సంభాషణలు రాయించాలని చిరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పరుచూరి సోదరులు కూడా అందుకు ఓకే అనేశారని సమాచారం. ప్రస్తుతం పరుచూరి సోదరుల దృష్టి.. వర్థమాన రచయితలపై పడిందట. వాళ్లలో ఈ తరహా సబ్జెక్టులను ఎవరు బాగా డీల్ చేయగలరో వెదికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. పరుచూరి వారి శిష్యగణానికి అంతే లేదు. వాళ్లలో ఎవరో ఒకరు.. ఈ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది. దానికి తోడు సురేందర్ రెడ్డి దగ్గరా చాలామంది రచయితలు ఉన్నారు. వాళ్లూ చేయి చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. డైలాగ్ వెర్షన్ పూర్తయితే గానీ.. ఈసినిమా పట్టాలెక్కదన్నమాట.