2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజేతను నిర్ణయించిన ప్రధాన అంశాల్లో ‘అనుభవం’ కూడా ఒకటి. రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా, భారీ ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా మిగిలిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవజ్ఙుడైన పాలకుడు అవసరం అని చెప్పి ప్రజలు భావించారు. ప్రజల ఆలోచనలను ఆ రకంగా ప్రభావితం చేయడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు టిడిపి భజన మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించింది. జగన్ అనుభవలేమి గురించి ఎన్నో విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జగన్‌కి అనుభవం లేదు అన్న విషయాన్ని విమర్శించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకోడు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలు అయినా, మీడియా మీటింగ్స్ అయినా…విషయం ఏదైనా కూడా అనుభవం లేని జగనా నాకు చెప్పేది అని ఎటకారం చేస్తూ ఉంటాడు. ఇందులో ఒక విషయం నిజం. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవమున్న పాలకుడు అవసరం అన్నది నిజం. అలాగే చంద్రబాబుకు ఉన్న అనుభవం జగన్‌కి లేదు అన్నది కూడా నిజం. ఆ రకంగా చూస్తే చంద్రబాబు, పవన్‌లతో పాటు మీడియా చెప్పిన మాటలు కూడా నిజమే అనుకోవాలి.
మరి అదే నిజాన్ని ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా చెప్పగలరా? లోకేష్‌కి ఉన్న అనుభవమేంటి? పాలనా వ్యవహారాల్లో అనుభవం ఉందా? మొదటి సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. నాలుగు రోజులు కూడా చట్టసభలకు హాజరైంది లేదు. కానీ ఓవర్ నైట్ మినిష్టర్ అయిపోయాడు. ఇప్పుడు చంద్రబాబునాయుడికి లోకేష్‌కి అనుభవం లేదన్న విషయం గుర్తులేదా? ఓ నాలుగు నెలలు అన్నా చట్టసభ సభ్యుడిగా అనుభవం సాధించాక అప్పుడు మంత్రిని చేస్తే వచ్చే నష్టం ఏమైనా ఉందా? అనుభవం లేని పాలకుడు ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం అనే విషయంపై 2014 ఎన్నికల సమయంలో లెక్చర్లు దంచిన ఒక వర్గం మీడియా ఇప్పుడు లోకేష్ అనుభవం గురించి మాట్లాడగలదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకేష్ అనుభలేమి గురించి ఒక ట్వీట్ అన్నా వేయగలడా? లేకపోతే కెటీఆర్, జగన్‌లాంటి వాళ్ళకు మాత్రమే అనుభవం కావాలి. రాజకీయం నా బ్లడ్‌లోనే ఉంది అని భారీ పంచ్ డైలాగ్ పేల్చిన నారావారి అబ్బాయి లోకేష్‌కి అవసరం లేదు అని కొత్తరకం వాదనను తెరపైకి తెస్తారా?