ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా… కొత్త కూటమి అధికారంలో ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటి ఒక గొప్ప రాజకీయ సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారని నిపుణులు ఆవేదన చెందుతున్నారు! సమకాలీన రాజకీయాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగుని రీతిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రిపదవి కట్టబెట్టిన ఘనత చరిత్రలో చంద్రబాబు పేరుమీద లిఖితమౌతుంది. ఏప్రిల్ 2 నుంచి ఆంధ్రాలో ‘కొత్త కూటమి’ అధికారంలోకి వచ్చిందని చెప్పాలి. తెలుగుదేశం, వైకాపాలు సంయుక్తంగా పాలన మొదలుపెట్టాయని చెప్పాలి.
మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా కొత్తగా 11 మందిని చేర్చుకున్నారు. వీరిలో నలుగురు వైకాపా టిక్కెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయించినా వారితో చంద్రబాబు రాజీనామాలు చేయించలేదు. టీడీపీ తరఫున టిక్కెట్ ఇచ్చి ఉప ఎన్నికలకు పంపలేదు. అంటే, సాంకేతికంగా ఇప్పుడు మంత్రి పదవులు పొందిన జంప్ జిలానీలు ఇంకా వైకాపాలో ఉన్నట్టే కదా! అంటే, ఆంధ్రాలో అధికార ప్రతిపక్షాలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టే భావించాలి కదా. ఇంకా చెప్పాలంటే.. వైకాపా మాత్రమే కాదు, కాంగ్రెస్ కు కూడా ఏపీ ప్రభుత్వంలో స్థానం దక్కినట్టే అనుకోవాలి.
ఎలా అంటే, పాతా కొత్తా అంతా కలిపి ఏపీ మంత్రి వర్గంలో మొత్తం 26 మంది ఆమాత్యులున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం అక్కడ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు.. టీడీపీలో చేరి మళ్లీ మంత్రి అయ్యారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పితాని సత్యనారాయణ కూడా టీడీపీలో చేరిన తరువాత మంత్రి అయ్యారు. ఇక, కిమిడి కళా వెంకట్రావు అయితే ప్రజారాజ్యానికి వెళ్లి, అక్కడ దుకాణం మూసేస్తే మళ్లీ టీడీపీలో చేరి.. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇక, వైకాపా నుంచి గెలిచినవారు.. అమరనాథరెడ్డి, భూమా అఖిల ప్రియ, ఆది నారాయణ రెడ్డి, బొబ్బిలి రాజు సుజయ్ కృష్ణ రంగారావులు కూడా తాజాగా మంత్రులైపోయారు.
మొత్తంగా కేబినెట్ లో 26 మంది మంత్రులు ఉంటే… వారిలో ప్రతిపక్షాల నుంచి రకరకాల మార్గాల ద్వారా వచ్చిన ఏడుగురు ఉన్నారు. ఈ లెక్కన ఆంధ్రాలో అన్ని ప్రముఖ పార్టీలూ మిత్రపక్షాలే అన్నట్టుగా భావించొచ్చేమో..! ఇలాంటి రాజకీయ సంప్రదాయాన్ని ముందెన్నడూ చూసినట్టు లేదు.
కొసమెరుపు: దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకోవడం మంచిది కాదు! మంత్రి పదవి కావాలన్నా, తక్షణ గుర్తింపు రావాలన్నా ఫిరాయించి చూడండి. అలాంటివారికే చంద్రబాబు పెద్ద పీట వేసేస్తారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడటం అనేది విజన్ లేని కాన్సెప్ట్ అని ఆయన నిరూపించారు. ఎంత గొప్ప రాజకీయ సంస్కృతికి బీజం వేశారో..!