తెలుగుదేశం పార్టీ… ఒక సామాజిక వర్గానికి చెందిందనే ముద్ర ఎప్పుడో పడిపోయింది. దానికి తగ్గట్టుగానే మంత్రి పదవుల్లోగానీ, ఇతర పార్టీ నేతల నియామకంలోగానీ కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఎక్కువగా దక్కిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ క్రమంలో తెలుగుదేశం మూటగట్టుకున్న మరో అపప్రద ఏంటంటే… రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకత! టీడీపీ రెడ్లకు వ్యతిరేకి, ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉండదు అనేది కూడా బాగా స్థిరపడ్డ అభిప్రాయం. దీన్ని మార్చుకోవడం కిం కర్తవ్యంగా చంద్రబాబు పెట్టుకున్నట్టున్నారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది కాబట్టి, ఈ తరుణంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యతపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మంత్రి వర్గ విస్తరణలో భాగంగా కొంతమందిని పదవుల నుంచి తప్పించి, కొత్త బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటున్న కిమిడి కళావెంకట్రావుకు మంత్రి పదవి దక్కే ఛాన్సులున్నాయి. అయితే, ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గ నేతకు అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అదీ రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకుడికి అవకాశం ఇస్తే అన్ని రకాలుగా బాగుంటుందనే పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీ అధ్యక్షుడిగా నిమ్మకాయల చినరాజప్పకు అవకాశం ఇస్తారనే అభిప్రాయమూ ప్రచారంలో ఉంది. రాయలసీమ ప్రాంతం నుంచి ఒక రెడ్డికి అవకాశం ఇస్తే సరిపోతుందనీ, ఆ అవకాశం పార్టీ అధ్యక్ష పదవే అయి ఉండాల్సిన అవసరం లేదనే సూచనలు కూడా చంద్రబాబు ముందుకు వస్తున్నాయట!
అయితే, కడప జిల్లాకు చెందిన రెడ్డి నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా జగన్ దూకుడును అడ్డుకోవచ్చేనేది చంద్రబాబు వ్యూహంగా చెప్పుకుంటున్నారు. వైయస్ ఇలాఖాలో టీడీపీని ఎలాగైనా గెలిపించుకోవాలన్నది ఆ పార్టీ ముందున్న ఫ్రెష్ టార్గెట్. సో.. ఆ ప్రాంత రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల ఎప్పట్నుంచే పడ్డ ముద్రను చెరిపేసుకున్నట్టు అవుతుందని భావిస్తున్నారు. చిట్టచివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.