ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు అంతా సిద్ధమౌతోంది. ఆశావహులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఫిరాయింపుదారులు ఎన్నో ఆశలుపెట్టుకుని మరీ టీడీపీలో చేరారు. కానీ, అదిగో ఇదిగో అంటూ చంద్రబాబు సంవత్సరాలు గడిపేశారు. ఎట్టకేలకు నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక విస్తరణకు సిద్ధమౌతున్నారు. దీంతో ఫిరాయింపుదారులు చాలా హ్యాపీగా ఉండాలి! ఎందుకంటే, వారు టీడీపీలోకి వచ్చిన కారణమే పదవులు కదా! అది నేరవేరబోతోన్న తరుణం ఇదే కదా! కానీ, వాస్తవంలో మరోలా ఉంది. మంత్రి వర్గ విస్తరణపై ఫిరాయింపుదారులు చాలా టెన్షన్ లో ఉన్నట్టు సమాచారం. వైకాపా నుంచి వచ్చిన జంప్ జిలానీలకు మంత్రి పదవులు ఇస్తే.. గవర్నర్ దగ్గర నుంచీ కొర్రీలు తప్పవనే ప్రచారం మరోసారి మొదలైంది.
నిజానికి, మంత్రి వర్గ విస్తరణ ఆలస్యానికి కారణం ఫిరాయింపుదారులే. ఎందుకంటే, తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచీ టీటీడీపీ పట్టుబడుతోంది! ఆయనపై చర్యలేవీ అంటూ గవర్నర్ ను కార్నర్ చేసింది. గవర్నర్ అసత్వం వల్లనే తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఇష్టం వచ్చినట్టు ఫిరాయింపులకు పాల్పడుతోందనీ, గవర్నర్ తీరు ఆయనకి అనుకూలంగా ఉందంటూ ఆడిపోసుకుంది. ఈ క్రమంలో గవర్నర్ కచ్చితంగా హర్ట్ అయి ఉంటారు. ఇటీవలే, భూమా నాగిరెడ్డి మరణం కంటే కొన్ని రోజుల ముందు గవర్నర్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ప్రచారం జరిగింది. ఏపీ మంత్రి వర్గ విస్తరణలో జంప్ జిలానీలకు అవకాశం ఇస్తే కుదరదని గవర్నర్ నరసింహన్ కుండబద్దలు కొట్టినట్టు చంద్రబాబుకి తేల్చి చెప్పారని జోరుగా కథనాలు వచ్చాయి.
క్యాబినెట్ లోకి ఎవర్ని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి పరిధిలోని నిర్ణయమనీ, ఆయన విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారని సమాచారం. ఆ ధీమాతోనే క్యాబినెట్ విస్తరణ సీఎం సిద్ధపడ్డట్టు చెబుతున్నారు. అయితే, ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తే, గవర్నర్ స్పందించే అవకాశం ఉందనే అభిప్రాయమూ జోరుగా వినిపిస్తోంది. ఆయనకీ కొన్ని విచక్షణాధికారాలు ఉంటాయనీ, వాటినీ ప్రయోగించే అవకాశం ఉంటుంది కదా అనే అభిప్రాయమూ బాగానే ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రచారంలో నిజానిజాల పాళ్లు ఎంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగితే సరిపోతుంది.
ఈ క్రమంలో ఫిరాయింపుదారులు బెంగ ఎక్కువౌతోంది..! పదవులు ఆశించి పార్టీలోకి వచ్చాక, ఇప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వారిలో మొదలైందని సమాచారం. ఏమాటకి ఆమాట చెప్పుకోవాలి… ఏదైనా పద్ధతిగా జరిగితే పకడ్బందీగా ఉంటుంది. అంతేగానీ, అడ్డదారుల్లో పార్టీలు మారిపోయి, ప్రజా తీర్పునే హాస్యాస్పదంగా మార్చేస్తూ ఫిరాయింపు ఊతమిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారనేది గుర్తించాలి.