ఈ అసెంబ్లీ సమావేశాల మొత్తానికి హైలైట్స్‌గా నిలిచిన అంశాల్లో ఒకటి బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భజన. టిడిపి నేతలెవ్వరికీ కూడా సాధ్యం కాని రీతిలో చంద్రబాబు భజన చేశాడు ఈ బిజెపి నాయకుడు. విష్ణుకుమార్ రాజు భజనకు కారణం ఏంటో రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కాలేదు. కానీ తాజాగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడిన మాటలతో అసలు విషయం అందరికీ అర్థమైపోయింది.
‘మంత్రి పదవికి పనితీరు కొలమానం కాదని…భజన, జనం, కులం, డబ్బే అర్హతలని’ చెప్పి చంద్రబాబు మంత్రుల ఎంపిక గురించి విమర్శనాస్త్రాలు సంధించారు విష్ణుకుమార్ రాజు. పనిచేసేవారు, అవినీతిపై పోరాటం చేసేవారు అవసరం లేదని కూడా విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చాడు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం రేపు ఉందన్న విషయం తెలిసిందే. జనాలకు అయితే మంత్రి వర్గంలో ఉండబోయే వాళ్ళు ఎవరు…ఊడిపోయే వాళ్ళు ఎవరు అన్న విషయంపై స్పష్టత లేదుకానీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజుకు ఇప్పటికే స్పష్టత వచ్చేసి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణలో రాజుగారి పేరు ఉండుంటే ఆయనకు ఈపాటికే సమాచారం వెళ్ళి ఉండేది. ప్రమాణస్వీకారం టైంకి రాజ్‌భవన్‌కి రమ్మని చెప్పి ఉండేవాళ్ళు. అలాంటి ఆహ్వానాన్ని గట్టిగానే ఆశించినట్టున్నాడు రాజుగారు. ఇప్పుడు రాజుగారి అసంతృప్తి మాటలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టిడిపి నేతలు ఎవ్వరికీ కూడా సాధ్యం కాని స్థాయిలో భజన చేసినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు రాజుగారికి భజన చేదైపోయింది. అయినా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసిపి నుంచి వలస వచ్చిన వాళ్ళకే ఎలా సర్దిచెప్పాలో తెలియక చంద్రబాబు సతమతమవుతా ఉంటే మధ్యలో ఈ రాజుగారి మద్దెలదరువు ఏంది? అయినా ఆవేశంలో, అసంతృప్తిలో రాజుగారు ఒక నిజం మాత్రం చెప్పారు. మంత్రి పదవి రావాలంటే అవినీతి, కులం, డబ్బు విషయంలో కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. వాటన్నింటితో పాటు భజన కూడా కావాలి. అంతే కానీ ఉత్త భజనకే ఉన్నతపదవులు దక్కాలంటే ఎలా?