కుల ప్రాబల్యాలు లేని రాజకీయ వ్యవస్ధను ఊహించడం కష్టమే! కానీ, చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం అధికార పదవులకు సామాజిక సమీకరణలే మార్గమని దృవపరస్తోంది.
మంత్రి వర్గం ఏర్పాటులో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయడం తెలుగుదేశంలో మొదటి నుంచీ వున్న విధానమే. అయితే ఈ సారి ”పెద్ద పీట” కాస్తా! ఏకైక పీట గా మారిపోయింది. కానీ, ఇందులో ముస్లింలను పూర్తిగా పక్కన పెట్టేయడం, ఇద్దరు మహిళలలను తొలగించి ఒక్కరికే అవకాశం ఇవ్వడం…ఆడపడుచుల పట్ల తెలుగుదేశం ఉదాసీనతకు ఒక సంకేతమౌతుంది.
కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా, తెలుగువాడి ఆత్మగౌరవాని నిలబెట్టడానికి ఆడబిడ్డల అండదండలతో నందమూరి తారక రామారావు నెలకొల్పిన తెలుగుదేశం తన మౌలిక స్వరూప, స్వభావాలను పూర్తిగా కోల్పోయినట్టు అర్ధమౌతోంది.
మొత్తం 26 మంది మంత్రుల్లో వేర్వేరు పార్టీల నుంచి వచ్చినవారు ఏడుగురు వున్నారంటే ఎన్ టి ఆర్ భాషలో అయితే ”కుక్కమూతి పిందెల్ని” అందలం ఎక్కించినట్టే!
కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళి తెలుగుదేశంలోకి మారి మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి మారిన పితాని సత్యనారాయణలు మంత్రులైపోయినపుడు. తెలుగుదేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి, 5 సార్లు ఎమ్మెల్య్లే గా ఎన్నికైనా పదవి రాని గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సంయమనం పాటించాలని నచ్చజెప్పగల సీనియర్లు ఎవరున్నారు?
మంత్రివర్గ సహచరులను ఎంచుకోడానికి ముఖ్యమంత్రికి గల ప్రిరాగేటివ్ ను తిరస్కరించడానికి ఎవరికీ అవకాశంలేదు. ఆశాభంగం చెందిన వారు దుమ్మెత్తిపొయ్యడం కూడా సహజపరిణామమే! ఈ అంతర్గత పోరు రోడ్డున పడకుండా చూసుకోవలసిన బాధ్యతా అవసరమూ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రిదే!
ఏకంగా 11 మంది రాజీనామాల వరకూ వెళ్ళారంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారిలో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడం అనైతికం మాత్రమే కాదు, జగన్ పార్టీపట్ల చంద్రబాబు అభద్రతకు సూచిక మాత్రమే కాదు,రాజ్యాంగ పరమైన వివాదానికి తెరతీయడం కూడా! పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంకింద అనర్హత ప్రకటించాలన్న జగన్ ఫిర్యాదును పెండింగ్ లో వుంచి ”నలుగురు ఫిరాయింపుదారులకు” మంత్రి పదవులు ఇవ్వడం, అందులో గవర్నర్ ను భాగస్వామిగా చేయడంలో ప్రభుత్వ ఏకపక్షధోరణినకి ఏం సమాధానం చెబుతారు?
అధికారమే పరమావధి అనుకున్నపుడు నీతినియమాలతోబాటు రాజ్యాంగవిలువలు కూడా హరించబడతాయి అనడానికి నలుగురు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులు కావడమే సరికొత్త సాక్ష్యం!