ఆర్కే ఓపెన్ హార్ట్ గాని, కొత్త పలుకు గాని రాజకీయ వర్గాలు మీడియా పరిశీలకులు ఆసక్తిగానే చూస్తుంటారు. ఆయన భావాలతో ఏకీభవించకపోయినా ఏదో ఒకటి భిన్నంగా ధైర్యంగా అడుగుతారనే అభిప్రాయం అందుకు కారణం. అయితే రాను రాను ఆయనలోనూ మీడియా మేనేజిమెంటు పెరిగిపోతున్నట్టుంది. వివిధ సందర్భాల్లో అనుసరించే పద్ధతులు లెక్కలు వేరువేరుగా వుంటున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి హరీశ్‌రావును ఇంటర్వ్యూ చేశారు. మిగిలినవాటికన్నా కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ఆమోదిస్తారా లేదా అన్నదానిపైనే ఫోకస్ పెట్టేశారు. ఆయన ఒకటికి రెండు సార్లు కెసిఆర్ ఏం చేసినా బలపరుస్తానని చెబుతున్నా తిప్పితిప్పి అదే అడగడం! ఇది హరీశ్‌ను కమిట్ చేయించడానికా లేక ప్రొవోక్ చేయడానికా అర్థం కాదు. రాజకీయ చాతుర్యానికి లోటులేని హరీశ్ వంటివారు పదేపదే అడిగినంత మాత్రాన మరో విధంగా మాట్లాడతారా? ఒక వేళ తిరుగుబాటు చేయాలనుకున్నా ముందే చెప్పేస్తారా? కెటిఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను అని ఆయన చెప్పే అవకాశమే లేదు. రేపు ఏ పరిస్థితుల్లో ఈ మార్పు ముందుకు వస్తుందనేదాన్ని బట్టి అప్పుడు స్పందన తప్ప ఇప్పుడు బ్యానర్ వాల్యూ వున్న విషయమేమీ కాదది. ఇదే గాక ఓటుకు నోటు గురించి కూడా అడిగారు.మీ ప్రాధాన్యత తగ్గుతుందే అన్నారు.ఇవన్నీ స్టాక్ ప్రశ్నలే. రొటీన్ ఆన్సర్లే!
కాకపోతే ఈ సమయంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి(అప్పటికి మంత్రి కాలేదు) లోకేశ్‌తో ఆర్కేచేసినే ఇంటర్వ్యూ గుర్తుకు వస్తుంది. లోకేశ్‌ను హరీశ్‌తో పోల్చలేము గాని ఆయనను అడగాల్సిన అంశాలూ చాలా వున్నాయి. అసలాయన కొత్తగా వస్తున్నప్పుడు విషయపరిజ్ఞానం ఏ మేరకు వుంది, అభిప్రాయాలు ఎలా వుంటాయి తెలుసుకోవాలని జనం అనుకుంటారు. కాని ఆర్కే మాత్రం ఆ ఓపెన్ హార్ట్‌లో చంద్రబాబు తీరుతెన్నులు తండ్రీ కొడుకుల ముచ్చట్లుతో సరిపెట్టారు. ఓటుకు నోటుపై గాని, తెలంగాణలో పరిస్థితిపై గాని లేదంటే తెలుగుదేశం పొరబాట్లపై గాని గట్టిగా అడిగిందే లేదు. సుతిమెత్తగా అడిగి పంపించారు. సూటిగా ఇంకా చెప్పాలంటే కాస్త నాటుగా కూడా అడుగుతానని అంటూనే కొత్త నేతను పూర్తిగా ఆవిష్కరించకుండా ఆదుకోవడం.. ఇప్పటికే చేతులత్తేసిన హరీశ్‌ను మళ్లీ మళ్లీ ఒకే ప్రశ్న వేయడం బాగుందా అద్యక్షా?