బాహుబలి 2 ఆడియో వేడుక రోజున తన ట్వీట్లతో అందరినీ తనవైపుకు తిప్పుకొన్నాడు కీరవాణి. చాలా మంది బుర్రలేని దర్శకులతో తాను పనిచేశానని, తెలుగు సినిమా సాహిత్యం పడేకేసిందని.. ఇలా చాలా చాలా రకాలుగా వ్యాఖ్యానించాడు. ఎప్పుడూ లేనిది కీరవాణి ఈ రేంజులో రెచ్చిపోవడం ఏమిటని చాలామంది ఆశ్యర్యపోయారు. కొంతమంది గీత రచయితలైతే బాహాటంగానే కీరవాణి `తప్పు`ని ఎత్తి చూపారు. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజా మరో అడుగు ముందుకు వేశాడు. కీరవాణి వ్యాఖ్యల గురించి మాట్లాడిన ఓ వీడియో పోస్ట్ చేశాడు. కీరవాణి అలా మాట్లాడకుండా ఉండాల్సిందని సలహా ఇచ్చాడు. ఇది కీరవాణికి చెరింది. వెంటనే ఆయనా ట్వీట్లతో కౌంటర్లు వేశాడు.
ఐదు నిమిషాల్లో తన బుర్రని కడిగి పారేసిన తమ్మారెడ్డి భరద్వాజాకి కృతజ్ఞతలు చెప్పాడు కీరవాణి. తాము తప్పులు చేస్తుంటే, సరిదిద్దడానికి తమ్మారెడ్డి భరద్వాజా లాంటి వ్యక్తులు ఉండాల్సిందే అని పొగడ్తో, ఎటకారమో అర్థం కాని రేంజులో ట్వీటాడు. అంతేకాదు.. చాలామందిని హర్ట్ చేసిన ఆ వ్యాఖ్యల్ని తొలగిస్తున్నా… అన్నారు కీరవాణి. అంతేకాదు.. దర్శకులంతా చాలా గొప్పవాళ్లని, తనకే బుద్ది లేదని, గీత రచయితల్లో వేటూరికి 100 మార్కులు వేస్తానని, సిరివెన్నెలకు 90 అనీ, శివశక్తి దత్తాకు 35 మార్కులని తేల్చిన కీరవాణి తనకు మాత్రం 10 మార్కులే వేసుకొన్నారు. గీత రచయితలందరు రాసిన అన్ని పాటలంటే తనకు ఇష్టమని ఎద్దేవా చేస్తున్నాడు కీరవాణి. బాహుబలి 2 రీ రికార్డింగ్ పనులున్నాయని కాబట్టి, చేయకపోతే రాజమౌళి తిడతాడు కాబట్టి… ఇక సెలవ్ అంటూ ఈ ట్వీటు యాత్ర ముగించారు కీరవాణి.