వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ పరిస్థితి ఇప్పుడు దాదాపు అలానే ఉంది. మంత్రి పదవి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో మరోసారి కీలకం అవుతారనే అనుకున్నారు. కానీ, మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మొండిచేయి చూపించారు. అయితే, పయ్యావుల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని సమాచారం! పార్టీలో కీలక పదవి వస్తుందని ఎదురుచూస్తున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ కీలక పదవి ఏంటంటే… పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి.
ఇంతవరకూ కిమిడి కళా వెంకట్రావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మంత్రి వర్గంలోకి రావడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది. దీంతో ఆ స్థానం తనకు దక్కుతుందని పయ్యావుల ఆశిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవి ఇవ్వకపోయినా, రాష్ట్ర అధ్యక్ష పదవి కచ్చితంగా వస్తుందని భావిస్తున్నారట. అయితే, విశ్లేషకుల అంచనా మరోలా ఉంది. మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్ష పదవి కీలకమైందని చంద్రబాబు భావిస్తుంటారట! కాబట్టి, పయ్యావులకు కట్టబెట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు గతానుభవాలు చెబుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న తరుణంలో పయ్యావు కేశవ్ వాణి బలంగా వినిపించేది. పార్టీ తరఫున చాలా కీలకంగా క్రియాశీలంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ జాతీయ పార్టీ అయింది. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మారారు. దీంతో ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పయ్యావులకే ఇస్తారని అప్పట్లో అనుకున్నారు. ఎందుకంటే, పార్టీలో దాదాపు నంబర్ 2 స్థానంలో పయ్యావుల ఉండేవారు. ఓరకరంగా ఆ క్రియాశీలతే అప్పట్లో పయ్యావుల అవకాశాలకు గండికొట్టాయని అనేవారూ లేకపోలేదు! ఎందుకంటే, టీడీపీలో టాప్ 10 స్థానాల్లోనూ తానే ఉండాలని చంద్రబాబు అనుకుంటారు. అందుకే, అప్పుడు పయ్యావులకు అవకాశం ఇవ్వలేదంటారు.
ఆ అసంతృప్తితోనే పయ్యావుల కూడా కాస్త నిరాశ గురయ్యారు. గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించలేదు. ఒక దశలో వైకాపాలో చేరిపోతారన్న ప్రచారం కూడా సాగింది. కానీ, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పయ్యావులకు గుర్తింపు ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే, గతమే మరోసారి పునరావృతం అయింది. ఇప్పుడు కనీసం పార్టీ అధ్యక్ష పదవైనా దక్కుతుందని కొండంత ఆశతో ఉన్నట్టు సమాచారం. మరి, అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఎవరి పేరు ఉందో వేచి చూడాలి.