కాటమరాయుడు సినిమాకి రూ.60 కోట్ల వసూళ్లు వచ్చాయి. నిజానికి తెలుగు సినిమా రూ.50 కోట్ల మార్క్ దాటడం.. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది గానీ, ఒకప్పుడే రూ.50 కోట్లంటే పండగే. అలాంటిది ఇప్పుడో సినిమాకి రూ.60 కోట్లొచ్చినా భారీ నష్టాలు రావడం టాలీవుడ్‌లోని అనిశ్చితికి అతిపెద్ద నిదర్శనం. ఈ సినిమా తీసిన మూలాన నిర్మాత నష్టపోలేదు. హీరో నష్టపోలేదు. పోయిందల్లా బయ్యర్లకే. కాటమరాయుడు అనే కాదు… దాదాపుగా పెద్ద సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. స్టార్ హీరో సినిమా భారీ రేట్లకు కొనేశాం.. పోటీలో మనమే గెలిచాం అని సంబరపడే బయ్యర్లు… తీరా ఫైనల్ రన్ అయ్యేసరికి బావురు మంటున్నారు. ఎందుకంటే.. స్టార్ల సినిమాల వల్ల ఎక్కువ గా నష్టపోతోంది వాళ్లే. సినిమా హిట్టయితే.. ఆ స్థాయిలో లాభాలూ వాళ్లు అందుకోవడం లేదు. పోతే.. మాత్రం ఆస్తుల్ని తగలేసుకోవడం, అప్పులు మిగలడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.
అందుకే ప్రముఖ డిస్టిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద సినిమాల వల్ల ఒరిగేదేంలేదని, చిన్న సినిమలే బయ్యర్లకు డబ్బులు మిగులుస్తాయని తేల్చి చెప్పేశారు. అది అక్షరాలా నిజం. రూ.100 కోట్ల పెట్టి ఓ సినిమా తీశారనుకోండి. ఆ సినిమా హిట్టయి రూ.120 కోట్లు సాధిస్తే లాభమేంటి? అద్దెలు, పబ్లిసిటీ, వడ్డీలూ ఇవన్నీ కలుపుకొంటే ఇంకా చేతి చమురే వదులుతుంది. ఇక్కడ కూడా నిర్మాతలకు పోయిందేం ఉండదు. ఆ సినిమా క్రేజ్‌ని క్యాష్ చేసుకొని ముందే ఆమ్మేసుకొంటారు. థియేటర్ ద్వారా వచ్చిన వసూళ్లు బయ్యర్లకు అందుతాయా అంటే అదీ లేదు. గ్యారెంటీ షేర్ అని, అదని, ఇదని ఏవేవో లెక్కలు చెప్పి… వచ్చిన మొత్తం లోంచి నిర్మాత కొంత వెనక్కి లాక్కుంటాడు. సినిమా పోయిందనుకోండి. అవీ రావు.
పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే చాలా మేలు. కోటి రూపాయలతో ఓ సినిమా పూర్తయితే.. దానికి నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయనుకోండి. బయ్యర్కీ, నిర్మాతకీ రూపాయికి రూపాయి మిగిలినట్టే. అందుకే నాని, శర్వానంద్ లాంటి సినిమాలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. కోటి పెడితే కోటీ పోదు కదా?? మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే బడా సినిమాల కంటే మీడియం రేంజున్న హీరోల సినిమాలే బెటర్ అన్న నిర్ణయానికి బయ్యర్లు వస్తున్నారు. పెద్ద హీరోలు కూడా ఓ విషయం ఆలోచించుకోవాలి. బడ్జెట్లు పెంచుకొంటూ పోవడం వల్ల లాభం ఏమీ లేదని, వీలైనంత తక్కువలో సినిమా తీయడం వల్ల అటు నిర్మాతలకూ, ఇటు బయ్యర్లకూ నాలుగు డబ్బులు మిగులుతాయన్న విషయాన్ని గుర్తించుకోవాలి. తమ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తొందన్నది కాదు. కొన్న వాళ్లకు ఎంత మిగులుతుందన్నది ముఖ్యం. ఈ నిజాన్ని గుర్తుంచుకొన్న రోజు… ఏ పంపిణీదారుడూ రోడ్డు కెక్కడు. టెంట్ వేసుకొని `మాకు న్యాయం చేయండి మహాప్రభూ` అని బతిమాలుకోడు. పెద్ద హీరోలూ.. కాస్త ఆలోచించండి.