ఎందుకో…. చాలామందిలానే కీరవాణి ఈమధ్య ట్విట్టర్ పిట్ట అయిపోయాడు. ఓరోజు ఉన్న ఫలంగా 40 – 50 ట్వీట్లు దంచి పారేశాడు. దర్శకుల్ని బ్రెయిన్ లెస్ అన్నాడు. తెలుగు సినిమా పాట మంచంమీద ఉందన్నాడు… నా అండ ఉండగా రాజమౌళిని ఎవ్వరూ అందుకోలేడన్నాడు.. ఇంకా చాలా చాలా అన్నాడు. అన్నవాడు గమ్మున ఉండాలా…?? అదీ లేదు. మళ్లొచ్చి… ‘నాకే బుర్రా బుద్దీ లేదు. యారొగెన్స్ అంటే నేనే, ఈ ప్రపంచంలో అంతా గొప్పోళ్లే… నేను తప్ప’ అంటూ చమత్కారంగా మాట్లాడేస్తున్నాడు. కొన్ని ట్వీట్లు తీసేస్తున్నా అంటూ.. దానికంటే ఎక్కువ ట్వీట్లు పెట్టాడు.
అప్పుడు గానీ.. ఇప్పుడు గానీ.. కీరవాణి ఇలా స్పందించాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకో ఆయన బరెస్ట్ అయిపోతున్నాడు. కీరవాణి తాజాట్వీట్లు గమనిస్తే.. ఆయన ఆయన్ని తిట్టుకొంటున్నాడో, ఆ పేరు చెప్పి అందర్నీ ఏకి పారేస్తున్నాడో గన్ షాట్‌గా అర్థమైపోతోంది. ఈ సినీ ప్రపంచం ఆయన్నీ ఆయన పాటల్నీ అంతగా గుర్తించలేదన్నది ఆయన అనుమానం కాబోసు. అదీ ఒకింత నిజమే. ఆయన సలహాలు విని బాహుబలి తీసిన రాజమౌళి (ఈమాట కీరవాణి అనుకొన్నదే) ని పొగిడారు గానీ, కీరవాణిని పట్టించుకొన్నారా? పొగడ్డం పక్కన పెట్టండి. అసలు రాజమౌళి సినిమాల్లో సంగీతమే మైనస్ అన్నట్టు మాట్లాడుతున్నారు విశ్లేషకులు. బాహుబలికి కీరవాణి నేపథ్య సంగీతం హాలీవుడ్ సినిమాల్లోంచి ఎత్తేసిందని కూడా కొన్ని గాసిప్పులు వినిపించాయి. ‘నేనింత కష్టపడితే నన్నే ఇంత మాట అంటారా’ అనే అక్కసు కీరవాణి కి ఉండడంలో తప్పేం లేదు. దర్శకులూ అంతే. ట్రెండీ ట్యూన్లు కొట్టే తమన్నో, దేవిశ్రీ ప్రసాద్దో ఎంచుకొంటున్నారు గానీ.. కీరవాణి జోలికి వెళ్లడం లేదు. ‘ఇంతింత మంచి మంచి తెలుగు పాటలిస్తుంటే నా దగ్గరకు రారా’ అనే కోపం కూడా కీరవాణికి వచ్చేసి ఉంటుంది. అందుకే.. ఆయన అలిగి ఉండొచ్చు.
కానీ.. మధ్యలో రచయితలేం చేశారో అర్థం కావడం లేదు. కీరవాణిలో మంచి రచయిత దాగున్నాడు. అందుకే తన సినిమాల్లో ఒకటో రెండో పాటల్నీ తానే రాసుకొంటాడు. అంతగా కావల్సివస్తే శివశక్తి దత్తా ఉండనే ఉన్నారు. ఆయనకూ ఓ పాట అప్పగించొచ్చు. ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ పాటలు రాసేసుకొంటుంటే.. మిగిలిన రైటర్లు అలుగుతారు. అందుకే ‘మీకు అసలు పాటలు రాయడం రాదు’ అనేస్తే ఇక వాళ్లని పిలిచి పాట ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనేనేమో ఆ రోజు కీరవాణి అంతలా రెచ్చిపోయారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాహుబలి 1కీ బాహుబలి 2కీ రానంత పబ్లిసిటీ ఈ ట్వీట్లు తెచ్చిపెట్టాయి. అదే.. పది వేలు. కీరవాణి సారూ… అంతేనంటారా??