తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని హడావుడి చేస్తున్న బిజెపి వాస్తవ బలమెంతో అందరికీ తెలుసు. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ హవా ప్రభావంతో ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఘనవిజయం సాధించాక టిబిజెపి దూకుడు పెరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంతో సఖ్యత అంటూ మోడీ ప్రభుత్వం పట్ల మెతకవైఖరి అనుకూల వైఖరి అనుసరిస్తున్నా, టిబిజెపిలో ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా సొంత బలం పెంచుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు చిన్నగా ఉన్నా, తొందరలోనే ఎదిగిపోతామని ఇతర రాష్ట్రాల ఉదాహరణలు చెపుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆర్భాటం లేకుండా అంతర్గత చర్చలు, సమీకరణ వ్యూహాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన ”మిషన్ 2019” ప్రారంభించేందుకు స్వయానా వచ్చేస్తున్నారు. ఆయనతోపాటు ఐదుగురు కేంద్ర మంత్రులు కూడా అరుదెంచుతారట. ఇప్పటికే 13వేల పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ చెపుతున్నారు. బిజెపి ప్రధాన పోటీదారు కాదని తెలిసినప్పటికీ ఈ నేపథ్యంలో దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిందేనని టిఆర్ఎస్ అధినాయకులు ఆలోచిస్తున్నారు. అమిత్ షా రాకకు ముందే రాష్ట్ర మంత్రి, రాజకీయ వారసుడు కెటిఆర్ రంగ ప్రవేశం చేశారు. తాండూరు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఉధృత ప్రసంగం దీనికి ప్రారంభమేనట. కాంగ్రెస్, టిడిపిలపై దాడి కేంద్రీకరించినట్టు కనిపిస్తున్నా, నిజానికి అమిత్ షా మిషన్ను భగం చేయటమే కెటిఆర్ మిషన్. ఈలోగా టిఆర్ఎస్ ఆవిర్భావ సభ కూడా భారీగా జరుగుతుంది కనుక ప్రచారం తారాస్థాయికి చేరుతుందని, ఇదే విమర్శకులను, నిరాయుధులను చేస్తుందని ఆ పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.