టిటిడిపి కార్యనిర్వాహక అద్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపిలో చేరవచ్చనే కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన అమరావతి వెళ్లి అధినేత చంద్రబాబు నాయుడును కూడా కలసి వచ్చారు. రేవంత్‌ను చేర్చడానికి నాగం జనార్థనరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. అసలు మహబూబ్ నగర్లో తెలుగుదేశం నాయకులు ఈ ఇద్దరే గాక కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి వారు కూడా ఆరెస్సెస్ నేపథ్యం వున్నవారే.అయితే దయాకర్ రెడ్డికి అలాటి ఆలోచనలు లేవంటారు. రేవంత్ మాత్రం ముఖ్యమంత్రి కావడం వరకూ చాలా సార్లు బహిరంగంగానే మాట్లాడిన వ్యక్తి. తెలంగాణలో టిడిపి బాగా కుదించుకుపోవడం అధినేతకూ ఆయన కుమారుడు లోకేశ్‌కు కూడా ఆసక్తి తగ్గిపోవడం రేవంత్‌కు మింగుడుపడటం లేదు.పైగా నిధుల విషయంలోనూ కటకటగా వుందట. కాంగ్రెస్‌లోకి వెళ్లడం కష్టమే గాక అక్కడ నాయకత్వం వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో బిజెపి నేతలతో వున్న సంబంధాల రీత్యా అందులోచేరితే బెటరని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. 7వ తేదీన అద్యక్షుడు అమిత్ షా వచ్చినప్పుడు చేరతారా లేక మేలో మళ్లీ వచ్చినప్పుడు ఆ పనిచేస్తారా అన్నది ఇంకా తెలియదు.
ఇది ఇలా వుంటే అసలు బిజెపి టిడిపి అధినేతల మధ్యనే ఈ విషయమై అవగాహన కుదిరినట్టు ఒక కథనం. ఎపిలో టిడిపికి బిజెపి సహకరించేట్టు ఆ మేరకు తెలంగాణలో టిడిపిని బిజెపిలో విలీనం చేసేట్టు అనధికారిక అవగాహన కుదిరిందట. ఎటూ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనక వ్యయప్రయాసలు భరించేందుకు తండ్రీ కొడుకులు సిద్ధంగా లేరు. పొరుగు రాష్ట్ర పాలకులుగా హెరిటేజ్ వంటి సంస్థల నిర్వాహకులుగా సత్సంబంధాలు వుంటే చాలని అంచనాకు వచ్చారట. ఈ రోజు కాకుంటే రేపైనా రేవంత్ వంటి వారు తమ ఆశలకు అనుగుణమైన నిర్ణయం తీసుకోవడం తప్నదని వారికీ తెలుసు.అదేదో తమ ద్వారానే జరిగితే బావుంటుందన్న భావనే క్విడ్ ప్రో కోకు మూలమంటున్నారు.