బాహుబలి.. సినిమా కాదు, ఓ బ్రాండ్‌గా మారింది.తొలి భాగం రూ.600 కోట్లు సాధిస్తే, రెండో భాగం వెయ్యి కోట్లు అవలీలగా అందుకొంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ స్థాయి విజయం అందుకొంటుందని రాజమౌళితో సహా ఎవ్వరూ ఊహించలేదు. అద్భుతాలంతే. ప్లాన్ ప్రకారం జరగవు. అయితే… ఈ విజయం వెనుక టీమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. రాజమౌళి ఒక్కడే కాదు. ప్రభాస్, అనుష్క, కీరవాణి, సెంథిల్.. ఇలా ప్రతీ నటుడూ, సాంకేతిక నిపుణుడూ తన కెరీర్లో విలువైన ఐదేళ్ల కాలం ఈ సినిమాకి అర్పించారు. వాళ్లకష్టాన్నిపారితోషికాలతో లెక్కగట్టలేం. ఆ మాటకొస్తే ఎంతిచ్చినా తక్కువే. ఇప్పటికే ప్రభాస్, రానాలు ఈ సినిమా ద్వారా తమ కెరీర్లోనే అత్యధిక పారితోషికాలు అందుకొన్నారు. రాజమౌళి రెమ్యునరేషన్ చెబితే దిమ్మతిరిగిపోవడం ఖాయం. అయితే.. వీటితో సరిపెట్టకుండా ఆర్కా మీడియా.. బాహుబలి టీమ్‌కి ప్రత్యేక నజరానాలు ఇవ్వాలని నిర్ణయించుకొందని సమాచారం.
బాహుబలి 2 విడుదలై… నిజంగానే అందరి అంచనాల ప్రకారం రూ.1000 కోట్లు సాధిస్తే ఆ నజరానాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని, లేకపోతే… ఆకర్షణీయమైన బహుమానాలతో సరిపెడతారని తెలుస్తోంది. మొత్తానికి బాహుబలి టీమ్‌కి ఊహించని గిఫ్ట్ లు లభించడం ఖాయం. వాటి ఖరీదు ఎంతన్నది… బాహుబలి 2 తీసుకొచ్చే వసూళ్లని బట్టి ఉందన్నమాట. నటీనటులు, సాంకేతిక నిపుణలకే కాదు.. ఈ సినిమాకి తెర వెనుక ఉండి పనిచేసిన అందరికీ ఏదో ఓ రూపంలో బహుమానం అందివ్వాలని ఆర్కా మీడియా భావిస్తోందట. కష్టాన్ని గుర్తించడం ఎప్పుడూ శుభపరిణామమే కదా..!