టాలీవుడ్లో కథానాయికల కొరత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఏ దర్శకుడ్ని పలకరించినా, ఏ కథానాయకుడ్ని కదిలించినా `మన ఇండ్రస్ట్రీలో హీరోయినకు కొరత బాగా ఉందండీ` అంటుంటారు. అయితే స్టార్ హీరోల పక్కన నటించగలిగే సత్తా ఉన్న కథానాయికలకు ఏమాత్రం కొరత లేదనే చెప్పాలి. సమంత, తమన్నా, అనుష్క, రకుల్, శ్రుతిహాసన్, రాశీఖన్నా… ఇలా కనీసం పదిమంది కథానాయికల పేర్లు గబగబ చెప్పేయొచ్చు. వీళ్లంతా స్టార్ సినిమాల్లో నటించేంత ప్రతిభ ఉన్నవాళ్లే. కానీ.. విషయమేంటంటే… ఇంతమంది ఉన్నా సరిపోవడం లేదు. ఇదే… కథానాయికల పాలిట వరమైంది. వాళ్లు తోచినంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. పోనీలే పెద్ద హీరో సినిమా కదా, అని కనికరించడం లేదు. తాజాగా బాలకృష్ణ సినిమాకి ఇదే పరిస్థితి నెలకొంది.
నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుంది. ఆ మూడు స్థానాల్లోనూ కొత్తవాళ్లనే ఎంచుకోవాలని పూరి భావించాడు. అయితే… సడన్‌గా స్టోరీ మారింది. ముగ్గురూ కొత్తవాళ్లెందుకు, అందులో ఒకరైనా స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే.. అనిపించింది. అందుకే.. ఇప్పుడు ఓ పేరున్న కథానాయిక కోసం అన్వేషణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శ్రియని సంప్రదిస్తే.. కళ్లు చెదిరే పారితోషికం డిమాండ్ చేసిందని తెలుస్తోంది. నిజానికి శ్రియ చేతిలో సినిమాలేం లేవు. తాను ఖాళీనే. అయితే.. కథానాయిక కొరతని గమనించిన శ్రియ.. సడన్‌గా రేటు పెంచేసిందని చెబుతున్నారు. ఇటీవల ఫామ్ కోల్పోయి ఖాళీగా ఉన్న ఓ కథానాయికని అడిగినా.. కనీ వినీ ఎరుగని పారితోషికం అడిగిందట. దాంతో నిర్మాత కళ్లు బైర్లు కమ్మాయి. పూరి సినిమా కదా, బాలయ్య హీరో కదా అని హీరోయిన్లెవరూ తేరగా ఒప్పేసుకోవడం లేదు. ఈ డిమాండ్‌ని ఎలా క్యాష్ చేసుకోవాలా అని చూస్తున్నారు. రెండు హిట్స్ వచ్చాయో లేదో… . కీర్తి సురేష్ లాంటి కథానాయికలు కూడా తల ఎగరేస్తున్నార్ట. బడా దర్శకులు సంప్రదించినా.. `కథేంటి? నా పాత్ర ఏమిటి` అనే ఆరాల్లేకుండా.. పారితోషికం విషయంలో పేచీ పెట్టకుండా.. సినిమా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత వరకూ కొత్తమ్మాయిల్ని దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారు. వాళ్లయితే.. కనీసం తొలి సినిమా చేస్తున్నామన్న సంతోషంలోనో, రాక రాక అవకాశం వచ్చిందన్న ఆనందంలో ఎంత ఇస్తే.. అంత తీసుకొని నటిస్తున్నారు. ఓ హిట్టు పడితే.. సీనియర్లలానే కొండెక్కి కూర్చుంటున్నారు. దీపం ఉండగానే నాలుగు కాసులు వెనకేసుకోవడం వీళ్లని చూసే నేర్చుకోవాలి.