శ్రీమంతుడు కాంబినేషన్ మరోసారి పునరావృతం అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కోసం కొరటాల శివ ఓ కథని సిద్ఢం చేయడం, దానికి మహేష్ ఓకే అనేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం స్క్రిప్టుకు తుదిమెరుగులు దిద్దుతున్నాడు కొరటాల. మహేష్ – మురుగదాస్ సినిమా పూర్తవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కేస్తోంది. అధికార సమాచారం ప్రకారం మే – జూన్ మధ్య ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందట. అంటే.. మురుగదాస్ సినిమా అవ్వగానే… కొరటాల సినిమాతో బిజీ అయిపోతాడన్నమాట. కొరటాల కూడా ఈ సినిమాని ఎంత వీలైతే అంత తొందరగా మొదలు పెట్టేద్దామని భావిస్తున్నాడు. అందుకే.. కథానాయికల ఎంపిక పై ఫోకస్ చేశాడు. అందులో భాగంగా మహేష్ కోసం బాలీవుడ్ భామల పేర్లు పరిశీలిస్తున్నాడు. ‘ఎం ఎస్ ధోని’ సినిమాలో నటించిన కైరా అద్వానీని ఈ సినిమా కోసం ఎంచుకొన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల కైరాతో చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. మొత్తంగా ఇద్దరు కథానాయికలుంటారని, ఓ నాయికగా కైరా ఎంపిక దాదాపు ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. లండన్లో కీలక షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశార్ట. ఇక్కడ సినిమా లాంఛనంగా ప్రారంభమైన వెంటనే.. టీమ్ మొత్తం లండన్ వెళ్లిపోతుందని తెలుస్తోంది. తొలిసారి కొరటాల శివ బయటి రచయిత కథతో చేస్తున్న సినిమా ఇది ఈ కథ కోసం సదరు రచయితకు కొరటాల కోటి రూపాయల వరకూ పారితోషికం ఇచ్చాడట. ఈ సినిమా కోసం `భరత్ అను నేను` అనే పేరు పరిశీలిస్తున్నారు.